Wednesday, January 22, 2025

మూఢనమ్మకాలపై కందుకూరి పోరాటం

- Advertisement -
- Advertisement -

తెలుగు రచయిత, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశ లింగం పంతులు గూర్చి శ్రీశ్రీ ఇలా అన్నారు. “కార్యశూరుడు వీరేశలింగం/ కదం తొక్కి పోరాడిన సింగం/ దురాచారాల దురాగతాలను / తుద ముట్టించిన అగ్ని తరంగం” ఇది కందుకూరి వారి 174వ జయంతి. (16 ఏప్రిల్ 1948 27 మే 1919). “ఉద్యోగంలో చేరడానికి అమావాస్యనాడే ఎందుకు వచ్చా”వని అధికారి అడిగాడు. అందుకు వీరేశలింగం చెప్పిన సమాధానం అధికారి నోరు మూయించింది. “అయ్యా! అన్ని రోజులూ ఆ ఈశ్వరుడు సృష్టించినవనే చెపుతారు కదా? మరి అలాంటప్పుడు అన్ని రోజులూ మంచివే అలాంటప్పుడు ఇక నేను ఏ రోజు ఉద్యోగంలో చేరినా, అది మంచి రోజే అవుతుంది!” అని తాపీగా సమాధానమిచ్చాడు వీరేశలింగం.
ఈ విషయం “మూఢ నమ్మకాలపై నా పోరాటం” అనే గ్రంథంలో ఆయనే స్వయంగా రాసుకున్నారు. (పే. 24) అభిరుచి వున్నవారు ఆ పుస్తకం సంపాదించి, క్షుణ్ణంగా చదవడం మంచిది.

అందులో ఆయన అనేక ప్రహసనాలు రాశారు. అందులో ఒకటి “శకునాలు” అనే శీర్షికతో వుంది. ఉదాహరణకు ఇక్కడ అందులోని విషయాలు కొన్ని క్లుప్తంగా పొందుపరుస్తున్నాను. సున్నిత హాస్యం, వ్యంగ్యం మేళవించి ఎంతో మనోరంజకంగా రాశారు. గమనించండి! కుటుంబాన్ని తీసుకొని ప్రయాణం చేయాలంటే వెనకటి రోజుల్లో ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. అసలే రవాణా సౌకర్యాలు సరిగా లేని రోజులు. పైగా ఘడియ ఘడియకీ ముహూర్తాలు చూసుకొనే పిచ్చి. మనువాదులు ఆ పిచ్చిని ఎప్పటికప్పుడు మరింతగా పెంచి పోషిస్తూ వుండేవారు. ఆ విశేషాలన్నీ వీరేశలింగం సోదాహరణంగా రాసుకొచ్చారు. ఇన్నిన్ని చాదస్తాల మధ్య ఆ కాలం మనుషులు ఎలా బతికారబ్బా? అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది కూడా! ఆడవాళ్ళను తీసుకొని మంచీ చెడ్డా విచారించకుండా దురాభారం ఎలా బయలుదేరనండీ? పోనీ అమావాస్యకు ముందే బయలు దేరుదామంటే దోవలో అమావాస్య వస్తే మంచిది కాదని పెద్దలు చెప్పినారు. అమావాస్య వెళ్ళిన పాడ్యమి ప్రయాణానికి బొత్తిగా మంచిది కాదు, విదియనాడు బయలుదేరుదామంటే, ఆ రోజు శుక్రవారం అయ్యింది. అక్కడికీ మొండిగా చొరవ చేసి, బయలుదేరుదామని అనుకునేంతలో ఎవరో ‘హాచ్చ్’ మని తుమ్మినారు. అటువంటి అపశకునం అయిన తర్వాత ప్రయాణం ఎలా చేస్తామని ఆనాటికి మానేశాం.

శనివారం ఉదయమా దుర్ముహూర్తం! పిల్లలను తీసుకొని ఎలా బయలుదేరడం? ఆ మధ్యాహ్నమేమో వర్జం వచ్చింది. వర్జం వెళ్ళిన తరువాతి రాత్రి బండి కోసం కబురు చేయబోతుంటే గుడ్లగూబ కూసింది. అలాంటప్పుడు ప్రయాణం మానేయక తప్పదు కదా? ఇక ఏం చేయడం? ఆ మరునాడు చవితి. ప్రయాణానికి చవితి ఏ మాత్రం మంచిది కాదని అందరికీ తెలిసిన విషయమే కదా?
తరువాతి రోజు పంచమి, బయలుదేరాలి. కానీ, ఉదయాన నక్షత్రం మంచిది కాదు. అదీ కాకుండా వర్జం కూడా వచ్చింది. మధ్యాహ్నం బయలుదేరుదామని భోజనం చేసి పచార్లు చేస్తూ వుంటే, మాలబల్లి మీద పడింది. జ్యోతిష్యుణ్ణి పిలిపించి స్నానం చేసి, దీపం పెట్టుకొని శాంతీ గీంతీ చేసుకునేప్పటికి దీపాల వేళయ్యింది. రాత్రి భోజనాలు చేసి బయలు దేరుదామంటే పెద్దలందరూ చుక్క ఎదురు వెళ్ళకూడదన్నారు. సరే ఆ మరుసటి రోజు షష్ఠి. ఒక్క షష్ఠి మాత్రమే అయితే ఎలాగయినా బయలుదేరుదును. కాని ఆ రోజు పిడుగువలె మంగళవారం కూడా వచ్చింది. ఈ రెంటికి తోడు ఆ రోజు వట్టి పాడు నక్షత్రం. ఇక సప్తమీ బుధవారం ప్రయాణానికి బహు అనుకూలమైంది. కానీ ఆ రోజు మా చిన్న కుర్రవాడి పుట్టిన దినం. ఆ పండుగ ముగించుకుని భోజనాలు చేస్తే గాని బయలుదేరేది లేదని ఇంట్లో ఆడవాళ్ళు పట్టుబట్టారు. అసలు ఆ ఉదయాన్నే బయలదేరితే మధ్యాహ్నానికే దొంగల మర్రి దాటిపోయే వాళ్ళం.

దొంగల మర్రి అంటే దారి దోపిడీ దొంగలు పొంచి వుండే చోటు. కాని భోజనాలు కాగానే బయలుదేరుదామని బండి కట్టించి, తీరా ఎక్కబోయే సరికి వెధవముండ ఎదురుగా వచ్చింది. మళ్ళీ లోపలికి వెళ్ళి అర్ధ గంట సేపు ఆగినాము. అప్పుడు బయలుదేరినా దీపాలు పెట్టక ముందే దొంగల మర్రి దాటేసే వాళ్ళం.
కానీ వీధి గుమ్మంలోకి వచ్చేసరికి ఒంటి బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చాడు. అందుకని లోపలికి వెళ్ళి కొంత సేపు ఆగినాము. ఇలా అయితే లాభం లేదని వీధిలో ఎవరూ నడవకుండా జాగ్రత్తపడి పొరుగింట్లో నుంచి ఒక ముత్తయిదువును ఎదురు రమ్మని చటుక్కున బండి ఎక్కి బయలుదేరినాము. ఎంత మంచి శకునం చూసి బయలుదేరినా.. ఆ వెధవముండ ఎదురుగా వచ్చిన వేళ ఎటువంటిదో కానీ ఫలితం మాకు వెంటనే కనిపించింది. రాత్రి పది గంటలకు మేము జడుస్తూనే దొంగలమర్రి దగ్గరకు చేరాము. దొంగలు వచ్చి నగలన్నీ ఎత్తుకుపోయారు. మేం మంచి శకునం చూసుకొని బయలు దేరడం వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాం మొన్న ఓ సారి జాతకం చూపించుకొంటే నాకు ధన నష్టం వుందని జ్యోతిష్కుడు చెప్పాడు. అంటే అంతా నిజమైనట్టే కదా? జ్యోతిష్యం తప్పలేదు.

జ్యోతిష్యాన్ని నమ్మేవారు తాము నమ్మిన జోస్యాలు నిజం కానప్పుడు వాటిని పట్టించుకోకుండా పక్కన పెడతారు. ఎప్పుడైనా ఒకటి అరా నిజమైతే వాటినే మళ్ళీ పట్టుకొని వేళ్ళాడుతారు. ఒక విధంగా జ్యోతిషం చెడిపోయిన గడియారం లాంటిది. రోజుకు రెండుసార్లు ఆగిపోయిన గడియారం కూడా సరైన సమయాన్ని చూపిస్తుంది. అలాగని, ఆగిపోయిన గడియారాన్ని నమ్మడం ఎంత మూర్ఖత్వమో, జ్యోతిషాన్ని నమ్మడం కూడా అంతే మూర్ఖత్వం! వాస్తవానికి మనం ఏదైనా విషయం ఊహించి చెపితే, అందులో కొంత మేరకు నిజమయ్యే అవకాశాలు వుంటే వుంటాయి. ఉండకపోతే వుండవు. ఇకపోతే, దేవుడి విషయం చూద్దాం! ఒక కారుకు బ్రేకులు ఫెయిల్ అయి లోయలో పడిందని అనుకుందాం. ఆ ప్రమాదంలో బతికిన వాళ్ళు ‘ ఆ దేవుడి దయ వల్ల బతికామ’ని చెప్పుకొంటారు కదా? మరి చనిపోయిన వారిని ఎవరు చంపినట్టూ? ఆ దేవుడు చంపాడని చెప్పాలి కదా? కానీ చెప్పరు. ఒకవేళ ప్రమాదానికి గురైన ఆ కారులోని వారంతా చనిపోతే మీడియాలో వార్త ఇలా వుంటుంది “కారు బ్రేకులు ఫెయిల్ అయి, అందులో ప్రయాణిస్తున్న అయిదుగురు మృతి చెందారు” అని వుంటుంది. బ్రేకులు ఫెయిల్ కావడం హై లైట్ అవుతుందే తప్ప ఆ వార్తలో దేవుడి ప్రసక్తి వుండదు.

ప్రయాణికులు బతికితే ‘దేవుడి దయ’ వల్ల బతికారనడం, మరణిస్తే మాత్రం, తప్పు బ్రేకులు ఫెయిల్ కావడంపై పెట్టడం ఏమైనా బాగుందా? తప్పు దేవుడి మీద పెట్టి, ఆయన చంపేశాడని అనుకొనే ధైర్యం వుండదు. ప్రజలు ఇలాంటి ధోరణికి అలవాటుపడిపోవడం వల్ల కదా దేవుడు, జ్యోతిషం, వాస్తు, ఆత్మ, పునర్జన్మ వంటి అంధ విశ్వాసాలు సమాజంలో సజావుగా బతుకుతున్నాయి? ఇలాంటి విశ్వాసాల వల్లనే సమాజం రోగగ్రస్తమవుతూ వుంది? మన జీవితంలో మన చుట్టూ జరుగుతున్న విషయాల్ని నిశితంగా పరిశీలిస్తూ, హేతుబద్ధంగా విశ్లేషించుకుంటే నిజానిజాలు బయటపడతాయి! “దైవాన్ని, జ్యోతిషాన్ని నమ్మేవారు తమ సౌకర్యానుసారంగా ఆలోచనల్ని, విధి విధానాలని మార్చుకుంటూ వుంటారని” వీరేశలింగం పంతులు ఏనాడో చెప్పారు. మరి, మనవాళ్ళు ఏమైనా చెవికి ఎక్కించుకున్నారా? లేదే? గుడ్డెద్దు చేలో పడ్డట్టు గుడ్డిగా మూఢ నమ్మకాల్లో పడిపోతున్నారు. ఒక పెరియార్, ఒక కందుకూరి, ఒక తాపీ ధర్మారావు, ఒక గోరా వివేచన అనే దుడ్డు కర్రలతో జనాన్ని అదిలిస్తూనే వచ్చారు. మనం కూడా ఆ పనిని కొనసాగిస్తూనే వుండాలి. జన చైతన్యానికి దోహదం చేస్తూనే వుండాలి! ఒక ప్రస్తుత పరిస్థితుల్లోకి వద్దాం! “మహా భారత కాలంలోనే సాటిలైట్, ఇంటర్‌నెట్ వుంది” అని అన్నాడు త్రిపుర ముఖ్యమంత్రి. నిజమే ! ఆయన ఊహ ప్రకారం ఆ రోజుల్లో చాలా చాలా జరిగేవేమో బహుశా ఆ “ఊహలు” ఇలా ఎందుకు వుండకూడదూ? ఊహలకు పరిధి ఏముంటుంది? ఎలాగైనా వుండొచ్చు. ఉదాహరణకు ఇలా కూడా వుండొచ్చు

(యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడు భయానక యుద్ధ చిత్రాల్ని ట్విట్టర్‌లో అప్‌డేట్స్ పెడుతుండేవాడు. అర్జునుడు వాటిని ఫాలో అవుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సైనిక బలగాలకు సూచనలిస్తుండేవాడే. ధృతరాష్ర్టుడు యుద్ధ విశేషాల్ని ఆన్‌లైన్ ఎఫ్.ఎం రేడియోలో వినేవాడు. పాండవులు తమ ‘ఐఫోన్’తో సెల్ఫీలు దిగేవారు. కౌరవులు తమ వాట్సప్ గ్రూపుల్లో ఉత్సాహభరితంగా సందేశాలు పంపుకునేవారు. తమ సైనికుల సాహసోపేతమైన దృశ్యాల్ని షేర్ చేసుకునేవారు. యుద్ధాన్ని మొత్తం ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రసారం చేసేవారు. బిబిసి, యస్.ఎన్.ఎ, 24 ఫ్రాన్స్, లియాన్, ఇండియా టుడే, యన్డిటివిలలో యుద్ధ వ్యూహాలపై విశ్లేషణలు జరిపేవారు…) ఇలా అని కేంద్రంలో అధికారంలో వున్న దేశభక్తుల్ని మనం ఎద్దేవా చేయడం కాదు. వాళ్ళకు వాళ్ళే, వాళ్ళేమిటో నిరూపించుకుంటున్నారు? లేకపోతే అర్ధ సత్యాలతో, అబద్ధాలతో తీసిన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూడండని ఈ దేశ ప్రజలకు స్వయంగా ఈ దేశ ప్రధాని చెపుతాడా? ‘నేడే చూడండి’ అంటూ ఊళ్ళల్లో ఓ మైకు రిక్షా తిరుగుతుండేది. ప్రధాని పదవి ఆ స్థాయికి చేరిందా? అదే ఎందుకు? గుజరాత్ అల్లర్లపై వచ్చిన ‘పర్జానియా’ (PARZANIA) పూర్తి హిందీ సినిమా యూట్యూబ్‌లో వుంది.

అది చూడమని చెప్పలేదెందుకూ? రేషన్ ఇవ్వడం చేతగాకే భాషణ్ లిస్తుంటాడని సగటు భారతీయుడికి అర్థమైంది. ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్‌లతో సామాన్యుల నుండి భారత ప్రభుత్వం వసూలు చేసిన ట్యాక్స్ రూ. 26.51 లక్షల కోట్లు. గతంలో కార్పొరేట్లకు ఇదే ప్రభుత్వం చేసిన రుణ మాఫీ రూ. 10.86 లక్షల కోట్లు.
మూఢ నమ్మకాలు, జ్యోతిషం, వాస్తు, ఆవు పేడ, ఆవు మూత్రం వాటితో ఈ దేశ ప్రజల్ని విడగొట్టి, విభజించి, దేశాన్ని “హిందూ రాష్ట్ర”గా మార్చాలన్న ఉద్దేశంతోనే విద్యారంగాన్ని కాషాయంలో ముంచుతున్నారు. “దేశం కాషాయీకరణ చెందితే తప్పేంటి?” అని దేశ ద్వితీయ పౌరుడైన తెలుగువాడు ప్రశ్నిస్తుంటే మనం 21వ శతాబ్దంలో వున్నామా? లేక సాధారణ శకానికి పూర్వకాలంలో వున్నామా? అని అనుమానపడాల్సి వస్తోంది. ఇప్పుడు బంతి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాల మీద వుంది. ప్రశ్నించగల సామర్థం, స్థైర్యం గల సామాన్య పౌరులు కూడా ప్రతిపక్షంలో వున్నట్టే ప్రజాకవి వేమన, కందుకూరి వీరేశలింగం లాంటి వారి రచనల నుండి స్ఫూర్తిని పొందాల్సి వుంది!.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News