Saturday, January 18, 2025

కందుల సాయి వర్షిత్‌కు 8 ఏళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్ వద్ద 2023లో భారత సంతతి యువకుడు ట్రక్కుతోదాడికి ప్రయత్నించిన సంఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో నిందితుడైన తెలుగుసంతతి వ్యక్తి 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ ను అప్పట్లో పోలీస్‌లు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో అతడికి 8 ఏళ్ల జైలుశిక్ష విధించినట్టు జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్ వెల్లడించారు. నాజీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యువకుడు ప్రయత్నించాడని పేర్కొన్నారు. “ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నాజీ భావజాలంతో కూలగొట్టాలనే ఉద్దేశంతో సాయివర్షిత్ ఈ దాడికి యత్నించాడు. అవసరమైతే అధ్యక్షుడిని కూడా చంపాలని తాను నిర్ణయించుకున్నట్టు అంగీకరించాడు. దీంతో అతడికి 8 ఏళ్లు జైలు శిక్ష విధించాలని న్యాయస్థానం నిర్ణయించింది.అతడి చర్యల వల్ల ధ్వంసమైన నిర్మాణాల తొలగింపు , పునర్నిర్మాణం మొదలైన ఖర్చులతో కలిపి నేషనల్ పార్క్ సర్వీస్‌కు 4,322 అమెరికా డాలర్లు (సుమారు రూ. 3,74,000) నష్టం వాటిల్లింది ” అని కోర్టు పేర్కొంది.

కోర్టు పత్రాల ప్రకారం 2023 మే 22 సాయంత్రం మిస్సోరి లోని సెయింట్ లూయిస్ నుంచి సాయి వర్షిత్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకొని రాత్రి 9.35 గంటల ప్రాంతంలో వైట్‌హౌస్ వద్దకు వెళ్లి సైడ్‌వాక్‌పై వాహనాన్ని నడిపాడు. పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అనంతరం శ్వేతసౌధం ఉత్తరభాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్ చేసి మరోసారి ఢీకొట్టాడు. వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకుని నినాదాలు చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపు లోకి తీసుకున్నారు. అధ్యక్షుడు జోబైడెన్‌ను హత్య చేయాలనే లక్షంతో ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి యత్నించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం అతడు ఆరు నెలలుగా ప్లాన్ చేసి మరీ ఈ సంఘటనకు పాల్పడినట్టు తేలింది. ఈ విషయాన్ని సాయివర్షిత్ విచారణలో అంగీకరించినట్టు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వర్గాలు మీడియాకు తెలిపాయి. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News