Sunday, January 19, 2025

కంగాళి…కాంగిరేస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీలో ముసలం ప్రారంభం అ య్యింది. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన దరఖాస్తులను స్క్రూటీని చేయడంలో భాగంగా మంగళవారం గాంధీభవన్‌లో పిసిసి ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిటీ (పిఈసి) సమావేశం నిర్వహించింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ స్క్రూటీని సరిగ్గా చేపట్టడం లేదని ఆ పార్టీ నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నాయకులు ఈ సందర్భంగా పిసిసికి పలు ప్రశ్నలను సంధిస్తున్నారు. ఉత్తమ్‌కుమార్ లాంటి నాయకుడికి రెండు టికెట్‌లు ఎలా కేటాయిస్తారని, ఒక్కో నియోజకవర్గం నుంచి ఎక్కువ దరఖాస్తులు ఎలా వచ్చాయని కూడా ఎలక్షన్ కమిటీని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు మంగళవారం జరిగిన సమావేశంలోనూ ఉత్తమ్, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిల మధ్య కూడా ఒక ఇంట్లో రెండు టికెట్‌లకు సంబంధించి వాగ్వాదం జరిగినట్టుగా తెలిసింది. తాను ఒక ఇంట్లో రెండు టికెట్‌లు ఇవ్వాలని సిఫార్సు చేయనని ఉత్తమ్‌తో రేవంత్ చెప్పినట్టుగా సమాచారం.

కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం ఇదే విషయాన్ని తన వద్ద ప్రస్తావించారని రేవంత్‌రెడ్డి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పేర్కొన్నట్టుగా తెలిసింది. దీంతో ఉత్తమ్ సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయినట్టుగా సమాచారం. అయితే ఈ సమావేశంలో ఒక్కో నియోజకవర్గం 10 కన్నా ఎక్కువగా దరఖాస్తులు రావడంతో చాలా దరఖాస్తులను సరిగ్గా పరిశీలించకుండానే ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న నాయకులు పక్కన బెట్టినట్టుగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. వారికి ఇష్టమున్నవారి జాబితాను అధిష్టానానికి పంపించడానికి ఈ కమిటీ ప్రయత్నిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ కాం గ్రెస్ నాయకులతో పాటు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు సైతం దరఖాస్తుల స్క్రూటీపై విభేదించారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించాలని, ఇన్ని రోజులుగా పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించాలని, పార్టీని విడిచిపెట్టకుండా ఇన్ని రోజులుగా పార్టీని నమ్ముకున్న వారిని గుర్తించి వారి అభ్యర్థిత్వాన్ని గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఏకాభిప్రాయం ఉన్న 25 నియోజకవర్గాలు
అయితే మంగళవారం సమావేశమయిన ఎలక్షన్ కమిటీ దరఖాస్తుల పరిశీల తర్వాత అభ్యర్థులైన జాబితాను రూపొందించి స్క్రీనింగ్ మిటీ చైర్మన్‌కు మురళీధరన్ కమిటీకి నివేదించనుంది. టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై ఎలక్షన్ కమిటీ సమావేశంలో నాయకులు చర్చించారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం నుంచి 2 లేదా 3 పేర్లను మాత్రమే స్క్రీనింగ్ కమిటీకి పంపాలని ఈ సమావేశంలో నాయకులు నిర్ణయించినట్టుగా తెలిసింది. వీటితో పాటు ఏకాభిప్రాయం ఉన్న 25 నియోజకవర్గాలకు సంబంధించిన దరఖాస్తులను సైతం స్క్రీనింగ్ కమిటీకి పంపాలని దీంతోపాటు ఎటువంటి వివాదాలు లేకుండా ఇద్దరు మాత్రమే పోటీ ఉన్న దాదాపు 30 నియోజకవర్గాలను సైతం ఎన్నికల కమిటీ ఎంపిక చేసి ఈ అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పంపాలని ఈ సమావేశంలో నాయకులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
ఢిల్లీలో కీలక మంతనాలు
అయితే స్క్రీనింగ్ కమిటీలో తమ దరఖాస్తులను పట్టించుకోరన్న ఆందోళనతో కొందరు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ కేంద్రంగా టికెట్లు పొందాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన కీలక నాయకులతో వారు ఇప్పటికే మంతనాలు ప్రారంభించినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో మంచి సంబంధాలు కలిగిన టిపిసిసి, ఏఐసిసి కీలక నేతలకు ‘అన్నా.. ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఆయా కీలక నేతలు కూడా టికెట్లు ఆశిస్తున్న లీడర్లకు భరోసా ఇస్తున్నట్టు సమాచారం. అయితే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఇలా ంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. అయితే సర్వే లు, ప్రజాదరణను పార్టీ హైకమాండ్ కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుందని నాయకులు పేర్కొంటున్నారు.
40 స్థానాల్లో ఇద్దరు లేదా ముగ్గురి జాబితా
అయితే మంగళవారం జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దాదాపు 25 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ 25 స్థానాల్లోని అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు వారి జాబితాను మురళీధరన్ కమిటీకి పంపించాలని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అయితే వీరితో పాటు దాదాపు 40 స్థానాల్లో ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడుతుండటంతో వారి గురించి ఎన్నికల కమిటీ తీవ్రంగా చర్చించినట్టుగా తెలిసింది.
25 నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు!
25 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు దాదాపు ఖరారయినట్టుగా తెలిసింది. అందులో నల్గొండ నియోజకవర్గం నుంచి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అలంపూర్ నుంచి సంపత్ కుమార్, నాగార్జునసాగర్ నుంచి కుందూరు జైవీర్ రెడ్డి, వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, మంచిర్యాల నుంచి ప్రేమ్‌సాగర్ రావు, మంథని నుంచి శ్రీధర్ బాబు, ఆందోల్ నుంచి దామోదర రాజనర్సింహా, పరిగి నుంచి రాంమ్మోహన్ రెడ్డి, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి, మధిర నుంచి భట్టి విక్రమార్క, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్య, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య, ఇబ్రహీం పట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్‌లకు టికెట్‌లు దాదాపు ఖరారు అయినట్టేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Congress 2

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News