న్యూఢిల్లీ: దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్య్రం కానేకాదని అది భిక్ష(భీక్) అని, నిజమైన స్వాతంత్య్రం 2014లోనే సిద్ధించిందని నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మోడీ సారథ్యపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 సంవత్సరం నుంచే దేశం స్వతంత్రతను సంతరించుకుందనే ఆమె వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కంగనా వ్యాఖ్యలను జాతి వ్యతిరేక వ్యాఖ్యలుగా పలువురు పేర్కొన్నారు. అడుక్కున్నట్లుగా తెచ్చుకున్నది స్వాతంత్య్రం అవుతుందా? 1947లో ఇదే జరిగింది. దీనిని మనం మన స్వేచ్ఛాయుత ఘట్టం అనుకోవడానికి వీల్లేదు. బ్రిటిషర్లు పరాయి పాలకులు అయితే వారి ప్రతినిధుల తరంగా కాంగ్రెస్ రూపుదిద్దుకుంది. స్వాతంత్రాన్ని అడిగితెచ్చుకున్న కాంగ్రెస్ దేశానికి నిజమైన స్వాతంత్యాన్ని ఇవ్వలేదని రనౌత్ వ్యాఖ్యానించారు.
అయితే, 2014 తరువాతనే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని అనుకోవల్సి ఉంటుందని, ఈ విధమైన స్థానికతను ఇప్పుడు మనం పొందుతున్నామని ఈ నటి ఓ టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెప్పడం, దీనిపై కొందరు ప్రేక్షకులు చప్పట్లకు దిగడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కంగనా వ్యాఖ్యను బిజెపి ఎంపి వరుణ్ గాంధీ సహా పలువురు నేతలు ఖండించారు. ఆమె స్పందన పూర్తిగా దేశ వ్యతిరేకం అని, ఈ కోణంలోనే ఆమెపై చర్యలు తీసుకోవాలని వరుణ్ డిమాండ్ చేశారు. ఆమెకు పిచ్చి ఉందా? దేశద్రోహానికి దిగుతోందా? అని ప్రశ్నించారు. ఇటువంటి పెడసరపు మాటలపై ఎటువంటి చర్యలకు దిగకపోతే మనం మన దేశభక్తులను కించపర్చినట్లు అవుతుందన్నారు. దేశం కోసం తమ జీవితాలను, రక్తాన్ని త్యాగం చేసిన వారి పట్ల ద్రోహం చేసేలా వ్యవహరించరాదని కోరారు, దేశ స్వాతంత్య్ర ఘట్టాన్ని కించపరిచే వారిని ఖండించడం ద్వారా మనను మన ఔన్నత్యాన్ని చాటుకోవల్సి ఉందన్నారు. ఈ మధ్యకాలంలో మహాత్మాగాంధీ హంతకులను కొనియాడటం, పూర్వపు త్యాగధనులను కించపర్చేలా మాట్లాడటం రివాజు అయిందన్నారు.
Kangana controversial Comments on Independence