దేవభూమి ద్వారక: ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శుక్రవారం సూచనప్రాయంగా వెల్లడించార. శ్రీకృష్ణ భగవానుడు ఆశీర్వదిస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కంగన ప్రకటించారు.
ప్రఖ్యాత ద్వారకాధీశ ఆలయాన్ని శుక్రవారం ఉదయం కంగన సందర్శించారు. ఆలయం వెలుపల ఆమె విలేకరులతో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు శ్రీ కృష్ణ కీ కృపి రహీతో లడేంగే(శ్రీ కృష్ణుడి ఆశీస్సులు ఉంటే పోటీచేస్తా) అంటూ ఆమె జవాబిచ్చారు. 600 సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుండడడంపై ఆమె కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
బిజెపి ప్రభుత్వం కృషి కారణంగానే 600 సంవత్సరాల పోరాటం తర్వాత భారతీయులకు ఈ సుదినం రానున్నదని ఆమె అన్నారు. అత్యంత వైభవోపేతంగా అయోధ్య రామాలయాన్ని ప్రారంభించుకుంటామని ఆమె చెప్పారు. ప్రపంచమంతటా సనాతన ధర్మం పతాక ఎగరాలని కూడా ఆమె ఆకాంక్షించారు.
సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరం శిథిలాలను సందర్శించేందుకు భక్తులకు సౌకర్యం కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.