Sunday, November 17, 2024

సోనియాకు కంగనా క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రుణాలు చేసి, ఆ మొత్తాన్ని సోనియా గాంధీకి సమర్పించిందని బీజేపీ మండి ఎంపీ కంగనా రనౌత్ నిరాధార ఆరోపణలు చేయడంపై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సోమవారం సవాలు చేసింది. ఆ ఆరోపణలు కంగనా రనౌత్ రుజువు చేయాలని, లేదంటే సోనియాకు క్షమాపణ చెప్పాలని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. క్షమాపణలు చెప్పకుంటే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించింది. “అభివృద్ధి కోసం కేంద్రం నుంచి లేదా రాష్ట్రం నుంచి వచ్చే నిధులు సోనియా గాంధీకి సమర్పించడమౌతోందని చెప్పడం కన్నా తెలివితక్కువ ప్రకటన ఇంకోటి ఉండదని, ఇది ఆ ఎంపి మేధో దివాళాతనాన్ని తెలియజేస్తుందని హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్యసింగ్ విలేఖరుల సమావేశంలో ధ్వజమెత్తారు.

“నేను బహిరంగంగా సవాలు చేస్తున్నాను. కనీసం ఒక్క రూపాయి యైనా దారిమళ్లిందని కంగనా రనౌత్ రుజువు చేయాలి. లేదా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి క్షమాపణ చెప్పాలి. అలా చేయకుంటే ఆమెపై కాంగ్రెస్ పరువునష్టం దావా వేస్తుంది” అని సింగ్ హెచ్చరించారు. ఆదివారం నాడు కంగనా రనౌత్ కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా అప్పులు చేసి ఆ మొత్తాన్ని సోనియాకు పంపిస్తున్నాయని, ఆ డబ్బుల తోనే ఎన్నికల్లో కాంగ్రెస్ విరివిగా ఖర్చుపెడుతోందని, దీంతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని వ్యాఖ్యానించారు.

“ మేం (కేంద్రం)ప్రకృతి వైపరీత్యాల నిధులు అందజేస్తే, అవి సిఎం రిలీఫ్ ఫండ్‌కు వెళ్తాయి. కానీ ఆ నిధులు అక్కడ నుంచి సోనియా గాంధీకి వెళ్తాయని ప్రతివారికీ తెలుసు” అని కంగనా రనౌత్ మనాలి లోని బీజేపీ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి విక్రమాదిత్యసింగ్ “ఆమె అంతగా చదువు కోలేదని, ఆమె ప్రకటనల్లో ఇది ప్రతిబింబిస్తోందని చెప్పడం బాధకలిగిస్తోంది. ” అని ఎద్దేవా చేశారు. ఆమె సినిమా “ఎమర్జెన్సీ” ఇంకా సెన్సార్ బోర్డ్ నుంచి రిలీజుకు నోచుకోకపోవడాన్ని సింగ్ గుర్తు చేస్తూ ఆ విచారంలో ఆమె ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సున్నితమైన అంశాలపై మాట్లాడవద్దని కేంద్ర బీజేపీ నాయకత్వం హెచ్చరించినా, కంగనా రనౌత్ అదుపు తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News