ముంబయి : తన పాస్‌పోర్టు రెన్యూవల్ కాకుండా అధికారులు అడ్డుకుంటున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వేసిన పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. తనపై ముంబయి పోలీసులు గతేడాది ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినందున పాస్‌పోర్టు అధికారులు రెన్యువల్‌కు నిరాకరించారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, పిటిషన్‌లో పాస్‌పోర్టు అథార్టీని పార్టీగా చేర్చకపోవడాన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పు పట్టింది. అంతేగాక పిటిషన్‌లో చేస్తున్న ఆరోపణలు అసమగ్రంగా ఉన్నాయని కూడా ధర్మాసనం గుర్తు చేసింది. అందులో మార్పులు చేసి తిరిగి పిటిషన్ వేయడానికి ఆమె న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖీకి కోర్టు అనుమతిచ్చింది. కంగనాకు మరో వారం రోజుల్లో బుడాపెస్ట్‌లో షూటింగ్ ఉన్నందున త్వరగా విచారణ జరపాలని సిద్దిఖీ కోరగా ధర్మాసనం నిరాకరించింది. ఓ సినిమా షూటింగ్ కోసం విచారణను ముందుకు జరపలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. తమకు వీలైన సమయం ఈ నెల 25 అని తేల్చి చెప్పింది. ధాకడ్ షూటింగ్ కోసం కంగన బుడాపెస్ట్ వెళ్లాల్సిఉన్నది.