న్యూఢిల్లీ: మాజీ సిపిఐ నాయకుడు కన్హయ్య కుమార్, గుజరాత్ ఎంఎల్‌ఏ జిగ్నేశ్ మేవాని మంగళవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వారు ఆ పార్టీలో చేరారు.
“దేశంలో వాక్‌స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న యోధుడిగా కన్హయ్య కుమార్‌కు పేరుంది. ఆయన మా కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల మా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగలదు” అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు.
బిజెపికి, దాని విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న జిగ్నేశ్ మేవానిని కూడా వేణుగోపాల్ ఈ సందర్భంగా పొగిడారు.
“ దేశం కాపాడబడేందు కోసమే నేను కాంగ్రెస్‌లో చేరుతున్నాను. అంతేకాదు కాంగ్రెస్ కూడా నిలదొకుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద నౌక వంటిది. అది కనుక కాపాడబడితే చిన్న చిన్న పడవలు కూడా కాపాడబడతాయి” అని కన్హయ్య ఈ సందర్భంగా తన అభిప్రాయం తెలిపారు.
కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరడం వల్ల బీహార్‌లో ఆ పార్టీ బలోపేతం కాగలదని అభిలషిస్తున్నారు. జెఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కన్హయ్య కుమార్ ప్రాధాన్యతను పొందారు. 2019లో లోక్‌సభ ఎన్నికలప్పుడు ఆయన సిపిఐలో చేరారు. బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఆయన బిజెపి అభ్యర్థి గిరిరాజ్ సింగ్‌పై పోటీ చేసి ఓడిపోయారు.
కాంగ్రెస్‌లో చేరిన జిగ్నేశ్ మేవాని సైతం గుజరాత్‌లో కీలక పాత్ర పోషించగలరని ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది గుజరాత్ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్(ఆర్‌డిఎఎం)కు మేవాని కన్వీనర్. ఇదిలా ఉండగా కాంగ్రెస్ మాజీ మహిళా చీఫ్ సుష్మితా దేవ్ కాంగ్రెస్‌ను వదిలి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.