కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక క్షేత్రం
చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయక క్షేత్రం ఎంతో సుప్రసిద్ధమైంది. ఈ క్షేత్రాన్ని పూర్వం విహారపురి అని పిలిచేవారు. 11 వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడు బ్రహహత్యాపాతక నివృత్తి కోసం వినాయక ఆలయం కట్టించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 1336లో విజయనగ ర రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. బహుదా నది ఒడ్డుపైన ఉన్న ఈ విఘ్వేశరుడు స్వయంభువుగా సాక్షాత్కరించారు. ఈ స్వామికి ఏటా వినాయక చవితి సందర్భంగా 21 రోజులపాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుతారు.
సంకటహర సిద్ధి విద్యాగణపతి ఆలయం
మెదక్ జిల్లా పటాన్‌చెరుకు అతి చేరువలోని రుద్రారంలో స్వయంభువుగా వెలసిన శ్రీ సంకష్ట హరసిద్ధి విద్యాగణపతి ఆలయం ఉంది. వందల ఏళ్లనాటి ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారం. ఇక్కడి స్వామి విగ్రహంపై ఉదరంతోపాటు చేతులకు కూడా నాగబంధం ఉండడం విశేషం. ఈ వినాయకుడిపై శ్రీచక్ర బీజాక్షరాలు ఉండడంతో ఆ శక్తిని సామాన్యులు తట్టుకోవడానికి వీలుగా స్వామివారికి రోజూ సిందూర లేపనం చేస్తారు. ఇక్కడి స్వామి విద్యాగణపతి కూడా కావడంతో అనేకమంది స్వామివారికి ప్రదక్షిణలు చేసి దర్శించుకుని విద్యా సముపార్జనగావిస్తారు.
సికింద్రాబాద్ గణపతి ఆలయం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలోగల గణపతి ఆలయం ప్రసిద్ధిపొందినది. పూర్వం సైనిక నివాస ప్రాంతంగా ఉన్న ఈస్థలంలో 1824లో సైనికులు మంచినీటి కోసం బావి తవ్వగా వినాయక విగ్రహం బయటపడింది. కంచి మఠం వారిచే ఈ విగ్రహం ప్రతిష్ట జరిగింది. ఈ ఆలయం జంట నగరాలలో అత్యంత మహిమాన్వితమైనదిగా విలసిల్లుతోంది.
రాయదుర్గం దశభుజ శ్రీ మహా గణపతి
అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో మూడు గణపతి ఆలయాలున్నాయి. వాటిలో రాయదుర్గం కొండపైకి వెళ్లే మార్గంలో కోట మెట్ల కింద ఆత్మకూరు వీధిలో ఉన్న దశభుజి గణపతి ఆలయం ప్రముఖమైనది. 4 మీటర్ల కొండరాయిపై మలచిన వినాయకుని రూపం భక్తుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. సుమారు 15 అడుగుల ఎత్తైన రూప ంలో పది చేతులు గల వినాయకుడిని ఎంతో నేర్పు గా మలిచారు. ఈ విగ్రహంలో వినాయకుడి తొం డం కుడివైపు తిరిగి ఉంటుంది. కూర్చుని ఉన్న వినాయకుడి ఎడమ తొడపై ఒక స్త్రీ రూపం ఉంటుంది.
కాజీపేట శ్వేతార్కమాల గణపతి
వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే దేవాలయ ప్రాంగణంలో శ్వేతార్కమాల గణపతి ఆలయం ఉంది. ఇక్కడి వినాయక మూర్తి తెల్ల జిల్లేడు వేరు మొదలు నుంచి ఉద్భవించింది. ఈ విగ్రహాన్ని చెక్కడం కాని, మలచడం కానీ చేయలేదు. స్వయంగా భూమి నుంచి పుట్టిన శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనం, తల్పం అన్నీ స్పష్టంగా కనబడతాయి. నారద పురాణంలో తెల్లజిల్లేడు వందేళ్లు పెరిగితే ఆ వృక్షమూలంలో గణపతి రూపం ఏర్పడుతుందని చెప్పారు. ఈ ఆలయంలో మూలమూర్తి పురాణ వచనానికి తగినట్లుగా కనిపిస్తున్నాడు. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం పరమ పవిత్ర స్థలంగా ప్రసిద్ధిచెందింది. యానాంలో వెలసిన సిద్ధ గణపతి (పిళ్లెయార్) నమ్మిన భక్తులకు కోరిన కోర్కెలు తీరుస్తూ అనుగ్రహిస్తాడు.
కొలనుపాక గణపతి
నల్లగొండ జిల్లా కొలనుపాక గణపతి ఆలయం వీరశైవ మతానికి సంబంధించిన గొప్ప చారిత్రక ప్రదేశం. ఇక్కడి గణపతి విగ్రహం చాళుక్యుల శిల్పకళా శైలితో కూడింది. చతుర్భుజాలతో పీఠంపై ఆశీనుడైనట్లుగా ఇక్కడి వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు.
చోడవరం స్వయంభూ వినాయక
విశాఖపట్టణం జిల్లా చోడవరంలో ఉన్న గౌరీశ్వరాలయం, వినాయక ఆలయాలకు స్వయంభువులుగా వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని గర్భగుడి ద్వారంపై ఉన్న చేప గుర్తులవల్ల ఇక్కడి స్వామివారిని మత గణపతిగా పేర్కొంటారు. ఈ వినాయకుడు చిన్నపాటి నీటి ఊటలో నల్లని రాతి విగ్రహంగా కనిపిస్తాడు. మూడడుగులకు పైగా పొడవు, వెడలులతో, ఛాతీభాగం వరకే స్వామివారు దర్శనమిస్తారు. మిగతా భాగం భూమి లోపలే ఉండడం విశేషం. తొండం చివరి భాగం కనిపించదు. వినాయక విగ్రహాన్ని గౌరీశ్వరాలయానికి తరలించడానికి తవ్వకం జరపగా తొండం చివర కనిపించకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చోవడరం స్వయంభూ వినాయక ఆలయం.
అయినవిల్లి ఆలయం
తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చేరువలో ఉన్న అయినవిల్లి సిద్ధివినాయక ఆలయం అత్యంత పురాతనమైంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున ఈ ఆలయాన్ని తొలుత దేవతలు నిర్మించారని స్థల పురాణగాధ. దక్షప్రజాపతి దాక్షారామంలో యఙ్ఞం నిరహించే ముందు అయినవిల్లి వినాయకుడి పూజించి పునీతుడైనట్లు క్షేత్ర పురాణం. భక్తులు 1,116 కొబ్బరికాయలతో స్వామివారికి అభిషేకం చేయించి మొక్కులు తీర్చుకుంటారు.
బిక్కవోలు గణపతి ఆలయం
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని గణపతి ఆలయం అత్యంత పురాతనమైంది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన గణపతి సుమారు ఏడడుగుల ఎత్తు ఉంటాడు. ఇక్కడి గణపతి ఆశీనావస్థలో దర్శనమిస్తాడు. ఈ గణపతి ఏటేటా పెరుగుతూ ఉంటాడని చెబుతారు. గతంలో స్వామివారికి చేయించిన వెండి తొడుగు ప్రస్తుతం చాలకపోతుండడం స్వామివారు పెరుగుతుందన్నారనేందుకు నిదర్శనంగా చెబుతారు. గణపతి చెవిలో భక్తులు కోర్కెలు, కష్టాలు విన్నవించుకోవడం ఈ ఆలయ ప్రత్యేకత.
Kanipaka Vinayaka Charitra