Monday, December 23, 2024

కర్నాటకలో అమూల్ ఉత్పత్తులకు నిరసన సెగ!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రక్షణ వేదికె సభ్యులు సోమవారం అమూల్ ఉత్పత్తులను రోడ్లపై పడేసి తమ నిరసన తెలిపారు. గుజరాత్‌కు చెందిన అమూల్ కంపెనీ కర్నాటక రాష్ట్రంలో నేరుగా తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. దానిని వేదికె సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. వారు మైసూరు బ్యాంక్ సర్కిల్ వద్ద తమ నిరసన చేపట్టారు. అమూల్ బ్రాండ్ ఉత్పత్తులను(పాలు, పెరుగు) నేరుగా అమ్మడం ద్వారా కర్నాటక పాల సమాఖ్య(కెఎంఎఫ్)ను అమూల్ బ్రాండ్‌లో విలీనం చేసుకోవాలన్న కుట్ర దాగుందని వారంటున్నారు.

కర్నాటక రక్షణ వేదికె అధ్యక్షుడు టిఎ.నారాయణ గౌడ నిరసనకు నేతృత్వం వహించారు. నిరసనకారులు అమూల్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి కూడా ప్రయత్నించారు. వేదిక ఉపాధ్యక్షుడు డి.పి.అంజప్ప ‘కన్నడ ప్రజల మనోభావాలతో అమూల్ సంస్థ ఆడుకుంటోంది’ అన్నారు. కన్నడిగులు నిర్మించుకున్న కర్నాటక మిల్క్ ఫెడరేషన్(కెఎంఎఫ్)ను నాశనం చేయడానికి తాము అనుమతించబోమని అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం అమూల్ సంస్థలో నందిని కంపెనీని కలిపేయాలని యోచిస్తోంది. ఒకవేళ అదే జరిగితే, స్థానిక ప్రజలు తిరుగుబాటుచేస్తారు’ అని ఆయన హెచ్చరించారు.

వేదికె యూత్ వింగ్ యూత్ ప్రెసిడెంట్ ధర్మరాజ్ గౌడ టి.ఎ. మాట్లాడుతూ ‘ఒకవేళ అమూల్ మొండిగా రాష్ట్రంలో తమ పాలు, పెరుగు అమ్మితే, అమూల్ అన్ని ఉత్పత్తులను బాయ్‌కాట్ చేస్తాము. అమూల్ కంపెనీకి చెందిన ఐస్‌క్రీమ్ నుంచి బిస్కట్ల వరకు దేనిని అమ్మనివ్వబోము. అమూల్ పాలు, పెరుగు అమ్మడాన్ని నిలిపేయాలి’ అన్నారు.

నిరసనకారులు అమూల్ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులు జోక్యం చేసుకుని ఆపేయించారు. పోలీసు సిబ్బందికి, నిరసనకారులకు మధ్య ఆ సందర్భంలో వాగ్వాదం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వేదిక ప్రధాన కార్యదర్శి బి.సన్నేరప్ప మాట్లాడుతూ, ‘అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వందలాది కార్యకర్తలను అరెస్టు చేయాలని పోలీసులను ఆజ్ఞాపించింది. పోలీసుల దౌర్జన్యాన్ని ఛాలేంజ్ చేస్తాము. రాష్ట్రం అంతటా నిరసనలు చేపడతాము. మరింత పోలీసు బలగాన్ని వారు పంపనివ్వండి’ అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News