Sunday, December 22, 2024

‘తెర’చాటు నేరాలు

- Advertisement -
- Advertisement -

కన్నడ అగ్ర సినీ నటుల్లో ఒకరైన దర్శన్ అకస్మాత్తుగా అరెస్టు కావడం, ఒక అభిమాని దారుణ హత్యలో అతని ప్రత్యక్ష ప్రమేయాన్ని ధ్రువపరుస్తూ ఒకటొకటిగా వాస్తవాలు వెలుగుచూస్తూండటం ఒక్క కన్నడ చిత్రసీమనే కాకుండా, యావత్తు భారత సినీ జగత్తునే కలవరపరుస్తున్నాయి. దర్శన్ నిన్న మొన్న సినీ రంగ ప్రవేశం చేసిన చిన్న నటుడేమీ కాదు. రెండు దశాబ్దాలుగా కన్నడ నటుడిగా, అగ్రహీరోల్లో ఒకడిగా చెలామణీ అవుతున్నారు. ఒకప్పుడు కన్నడ సినిమాల్లో నటించిన తన తండ్రి శ్రీనివాస్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని దర్శన్ సినిమాల్లోకి వచ్చారు.

తాజాగా తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యారు. ముప్పైమూడేళ్ల రేణుకాస్వామి దర్శన్‌కు కరడుగట్టిన అభిమాని. తనతో దర్శన్‌కు పదేళ్లుగా ఉన్న సాన్నిహిత్యాన్ని పవిత్రగౌడ అనే నటి సోషల్ మీడియా వేదికగా బయటపెట్టడం రేణుకాస్వామికి ఆగ్రహం తెప్పించింది.దర్శన్ వైవాహిక జీవితంలో పవిత్ర నిప్పులు పోస్తోందన్న కోపంతో ఆమెపై రేణుకాస్వామి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం దర్శన్ ఆగ్రహానికి కారణమైంది. పవిత్ర ప్రోత్సాహంతో, మరికొందరు అభిమానుల సాయంతో రేణుకా స్వామిని దర్శన్ వేధించి, హింసించి చంపారన్నది పోలీసుల అభియోగం. ప్రజాబాహుళ్యంలో పేరున్న నటుడిగా చెలామణీ అవుతూ, పది మందికీ ఆదర్శంగా ఉండవలసిన దర్శన్ గతంలోనూ అనేక వివాదాలకు కేంద్రబిందువుగా ఉండటం గమనార్హం.

పదేళ్ల క్రితం దర్శన్ పై ఆయన భార్య స్వయంగా గృహహింస కేసు పెట్టారు. అంతేకాదు, తనపై హత్యాయత్నం కూడా చేశారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో దర్శన్ అరెస్టయి, బెయిల్ పై విడుదలయ్యారు. గత ఏడాది తన పొరుగింటి మహిళపై పెంపుడు కుక్కలను ఉసిగొల్పారని దర్శన్ పై కేసు నమోదైంది. ఆ మధ్య దర్శన్ ఫామ్ హౌస్ లోంచి అటవీశాఖాధికారులు నాలుగు అడవి బాతులను స్వాధీనం చేసుకున్నారట. వన్యమృగ సంరక్షణ చట్టం ప్రకారం వీటిని నిర్బంధించి ఉంచడం నేరం. మైసూర్‌లో ఓ స్టార్ హోటల్లో వెయిటర్ పై దాడి చేసిన కేసులోనూ ఆయన నిందితుడు. ఇక దర్శన్ అండ్ కో చేతిలో కన్నుమూసిన రేణుకాస్వామి విషయానికొస్తే, అతను ఓ మందుల దుకాణంలో పనిచేసే సాదాసీదా వ్యక్తి. తాను ఎంతగానో అభిమానించే హీరో దర్శన్ కుటుంబంలో గొడవలు రేకెత్తిస్తోందనే ఆగ్రహంతోనే అతను పవిత్ర గౌడపై అశ్లీల పోస్టులతో ధ్వజమెత్తాడే తప్ప ఇందులో అతను వ్యక్తిగతంగా బావుకున్నదేమీ లేదు.ఒక విధంగా హీరో పట్ల గల దురభిమానమే అతని ప్రాణాలు బలిగొందని చెప్పవచ్చు.

మన దేశంలో అంగబలం, అర్థబలం ఉంటే చాలు, తమ దారికి అడ్డుఉండదని భావిస్తూ చెలరేగిపోయే అక్రమార్కులకు అంతూపొంతూ లేదు. సత్వర న్యాయం నానాటికీ మృగ్యమైపోతున్న నేటి రోజుల్లో చట్టాల్లోని లొసుగులను ఆధారం చేసుకుని, కేసులను ఏళ్ల తరబడి నడిపిస్తూ తప్పించుకు తిరిగే బడాచోరులకు తక్కువేం లేదు. దాదాపు పాతికేళ్ల క్రితం ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింకను వేటాడిన కేసులో ఇప్పటికీ పురోగతి లేకపోవడం ఇందుకు ఉదాహరణ. 1998లో సంఘటన జరిగితే, ఇంకా కోర్టుల్లోనే మగ్గుతోందంటే ఈ కేసు ఏ స్థాయిలో నత్తనడక నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. సినీ నటులకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉంటారు. వారిలో చాలా మంది తమ అభిమాన నటుడిని అనుకరిస్తూ, అనుసరిస్తూ ప్రేరణ పొందుతూ ఉంటారు. అలాంటివారికి ఆదర్శప్రాయంగా ఉండేందుకు నటీనటులు తెరపైనే కాదు, తెరవెనుక కూడా మచ్చలేని జీవితాన్ని గడపవలసిన అవసరం ఉంది. కానీ నేటి నటుల్లో చాలా మంది తమ వ్యక్తిగత జీవితం తమ ఇష్టం అనే ధోరణిలో ప్రవరిస్తూ, అభిమానులకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. మరో విచిత్రమేమంటే, రేణుకాస్వామిని హత్య చేసే క్రమంలో దర్శన్ తన అభిమాన సంఘాల నాయకుల సహాయాన్ని పొందాడన్న ఆరోపణలు రావడం. అదే నిజమైతే, తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్న సామెత సదరు హీరోగారికి వర్తించకమానదు. ఒక మనిషి ప్రాణాలు తీయడం నాగరిక సమాజంలో చాలా హీనమైన చర్య. పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాలు వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలను తోసిరాజని, చట్టాన్ని చేతిలోకి తీసుకుని కిరాతకంగా హత్య చేయడం సహించరాని విషయం. సెలబ్రిటీలు అయినంతమాత్రాన చట్టం నుంచి తప్పించుకోజాలరు. ధనబలం, అంగబలం ఉందనే అహంకారంతో తెగబడితే బుద్ధి చెప్పవలసిన బాధ్యత పోలీసు, న్యాయ వ్యవస్థలపై ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News