Tuesday, April 8, 2025

దేశంలోకి పసిడి స్మగ్లింగ్ ముఠాలపై సిబిఐ ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : దేశంలోకి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) శనివారం ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ‘పిటిఐ’ వార్తా సంస్థ వెల్లడించింది. డిఆర్‌ఐతోసమన్వయంతో పని చేస్తున్న సిబిఐ బృందాలు మరింత దర్యాప్తు నిమిత్తం ముంబయి, బెంగళూరు విమానాశ్రయాలకు చేరుకున్నారని అధికారులు తెలియజేశారు. ఎమిరేట్స్ విమానంలో ఈ నెల 3న దుబాయి నుంచి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న కన్నడ నటి రన్యా రావు (33)ను డిఆర్‌ఐ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు మొదలైంది.

రన్యా రావు దగ్గర నుంచి రూ. 12.56 కోట్లు విలువ చేసే 14.2 కిలోల బంగారం కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ. 17.29 కోట్లు. దేశంలోకి బంగారం అక్రమ రవాణాలో తన పాత్ర గురించి ప్రశ్నించినప్పుడు రన్యా రావు డిఆర్‌ఐ వద్ద ఒప్పుకున్నారు. యూరప్, యుఎస్, మధ్య ప్రాచ్య దేశాలకు తన తరచు పర్యటనల గురించి ఆమె వివరించారు. ‘దర్యాప్తు ప్రక్రియకు హాజరయ్యానని పునరుద్ఘాటిస్తున్నాను, నా దగ్గర నుంచి 17 బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారని అంగీకరిస్తున్నా’ అని ఆమె తెలిపారు.

దర్యాప్తు ప్రక్రియను గోప్యంగా ఉంచాలని ఆమె డిఆర్‌ఐకి విజ్ఞప్తి చేశారు. ‘నేను యూరప్, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లాను, దుబాయి, సౌదీ అరేబియాలను సందర్శించాను’ అని ఆమె తెలిపారు. ‘నాకు తగినంత విశ్రాంతి లభించనందున అలసిపోయాను. నేను ఇంకా చెప్పేందుకు ఏమీ లేదు. దర్యాప్తులో సహకరిస్తాను. పిలిచినప్పుడల్లా హాజరవుతా’ అని రన్యా రావు చెప్పారు. దర్యాప్తు నిమిత్తం రన్యా రావును మూడు రోజుల డిఆర్‌ఐ కస్టడీని బెంగళూరులోని ఆర్థిక నేరాల న్యాయస్థానం శుక్రవారం మంజూరు చేసింది. ‘జాతీయ భద్రత’ అంశమని పేర్కొంటూ డిఆర్‌ఐ ఆమె బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించిన తరువాత కోర్టు గురువారం తన ఉత్తర్వును రిజర్వ్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News