బెంగళూరు: ప్రముఖ కన్నడ సినీ నటుడు, నిర్మాత ఎస్ శివరాం శనివారం నాడిక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 83 సంవత్సరాల శివరాం ఆరు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగారు. 1938 జవనరి 28న తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శివరాం తన ఆరు దశాబ్దాలకు పైబడిన సినీ జీవితంలో కథానాయకుడి నుంచి సహాయ నటుడిగా విభిన్న తరహా పాత్రల పోషించారు. శివరామన్నగా పిలుచుకునే ఆయన దర్శకత్వంతోపాటు కొన్ని చిత్రాలను నిర్మించారు. 1965లో బెరత జీవ చిత్రంతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన దుడ్డె దొడ్డప్ప, లగ్న పత్రిక చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. నాగరహావు, నానొబ్బ కల్ల, యమజాన, ఆప్తమిత్ర, హొంబిసిలు చిత్రాలలో ఆయన పాత్రలు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాయి. తన సోదరుడు ఎస్ రామనాథన్‌తో కలసి రాశి బ్రదర్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి గెజ్జె పూజె, ఉపాసనె వంటి హిట్ చిత్రాలను అందించారు.
తన జీవిత చరమాంకం వరకు చిత్ర రంగంలోనే కొనసాగిన శివరాం తాజాగా స్నేహిత అనే చిత్రంలో నటించారు. శివరాం మృతి చెందినట్లు ఆయన కుమారుడు ఎస్ లక్ష్మయ్య శనివారం తెలిపారు. శివరాం మృతికి మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్ప, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, కన్నడ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Kannada Actor Shivaram passed away