విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా.మోహన్ బాబు మాట్లాడుతూ “కన్నప్ప సినిమా ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించాం. ఎంతో వ్యయప్రయాసలతో నిర్మించాం. భారత దేశంలోని నాలుగు మూలల ఉన్న మహా నటుల్ని ఈ చిత్రం లో తీసుకున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలుంటాయి. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం” అని అన్నా రు.
విష్ణు మంచు మాట్లాడుతూ “2014లో కన్నప్ప జర్నీ ప్రారంభమైంది. 2015లో నేను కన్నప్పని డెవలప్ చేస్తూ వెళ్తుంటే.. తణికెళ్ల భరణి పూర్తిగా నాకే అప్పగించారు. నా దైవం, నా తండ్రి మోహన్ బాబు, విన్ని, వినయ్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే కన్నప్పను తెరపైకి తీసుకు రాగలిగాను. కన్నప్ప మైథాలజీ కాదు.. కన్నప్ప మన చరిత్ర. రెండో శతాబ్దం లో జరిగిన కథ. చోళ రాజుల టైంలో జరిగింది. ఏడో శతాబ్దంలోనూ కన్నప్ప గురించి శంకరాచార్యుల చెప్పారు. 14వ శతాబ్దంలో నాయనార్ల గు రించి ధూర్జటి రాశారు. అందులో 9వ నాయనార్ కన్నప్ప.18వ శతాబ్దంలో బ్రిటీష్ వాళ్లు ఇంగ్లీష్‌లో ఈ కథను ప్రింట్ చేశారు. బికనీర్ యూనివర్సిటీలో ఆ పుస్తకం చూశాం. ఆ పుస్తకాన్ని చదివి.. ఎంతో జాగ్రత్తగా తీసి ఆడియెన్స్ ముందుకు ఈ సినిమాను తీసుకొస్తున్నాం” అని తెలిపారు.
ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ “కన్నప్ప సినిమాలో నాకు నా ఆర్టిస్టులే బలం. విష్ణు చేసిన యాక్టింగ్, పడిన కష్టం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. గడ్డ కట్టే చలిలోనూ టీం అంతా చలించకుండా పని చేసింది. విష్ణు, శరత్ కుమార్, మోహన్ బాబు అంత అంకితభావంతో పని చేశారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శరత్ కుమార్, మధుబాల, ప్రీతి ముకుందన్ పాల్గొన్నారు.