కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆరోపణ
తిరువనంతపురం : కేరళ లోని కన్నూర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఓ క్రిమినల్ అని, తనపై దాడి చేసేందుకు కుట్ర పన్నారని, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న సమయంలో యూనివర్శిటీకి వచ్చిన తనపై దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో వీసీ గోపీనాథ్ రవీంద్రన్ కూడా ఉన్నారన్నారు. కన్నూర్ నూతన వీసీ నియామకం విషయంలో గవర్నర్‌కు అధికార సీపీఐ(ఎం)కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో … వీసీ తీరుపై గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఈ విధంగా మాట్లాడారు. “ వీసీనే నన్ను యూనివర్శిటీకి ఆహ్వానించారు. నాపై భౌతిక దాడి జరిగే సమయంలో ఆయన బాధ్యత ఏమిటి ? పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా ? కానీ ఆయన అలా చేయలేదు. కేవలం రాజకీయ కారణాల వల్లనే ఆయన వీసీ స్థానంలో కూర్చున్నారు. ” అని గవర్నర్ మొహమ్మద్ ఖాన్ వ్యాఖ్యానించారు.
ఆ ఘటనపై యూనివర్శిటీ నుంచి రాజ్‌భవన్ పూర్తి వివరణ కోరినా ఆయన స్పందించలేదన్నారు. ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడిన కేరళ గవర్నర్ …. వీసీ ప్రవర్తనపై చర్యలు తీసుకునే అధికారం ఉన్నా కూడా తీసుకోలేదన్నారు. కానీ క్రమశిక్షణ, మర్యాద విషయంలో ఆయన అన్ని పరిధులు దాటడం వల్లే ఇలా బహిరంగంగా మాట్లాడాల్సి వస్తోందన్నారు. కన్నూర్ యూనివర్శిటీని నాశనం చేశారన్న గవర్నర్ … ఆయనకు రాజకీయ అండదండలు ఉన్నాయన్నారు. యూనివర్శిటీలో తనపై దాడి జరిపేందుకు జరిగిన కుట్ర వెనుక వీసీ ఉన్నారని కేరళ గవర్నర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీసీపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని ప్రశ్నించగా , న్యాయసలహా మేరకు నిర్ణయం తీసుకుంటానని బదులిచ్చారు.