కాన్పూర్: ఏడాదిన్నర క్రితం చనిపోయిన వ్యక్తిని ఇంకా కోమాలోనే ఉన్నాడని నమ్ముతూ ఒక కుటుంబం తమ ఇంట్లోనే ఉంచుకుంది. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ మృతదేహంపై అతని భార్య రోజూ ఉదయం గంగా జలాన్ని చల్లుతూ తన భర్త కోమా నుంచి లేచి కూచుంటాడన్న భ్రమలో ఆమె బతుకుతోంది. అత్యంత హృదయ విదారకమైన ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో శుక్రవారం వెలుగుచూసింది. ఆదాయం పన్ను(ఐటి) శాఖలో పనిచేసే విమలేష్ దీక్షిత్ గత ఏడాది ఏప్రిల్‌లో మరణించారు. ఆయన కార్డియాక్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కారణంగా మరణించినట్లు 2021 ఏప్రిల్ 22న ఒక ప్రైవేట్ ఆసుపత్రి డెత్ సర్టిఫికెట్ జారీచేసింది. అయితే దీక్షిత్ కుటుంబ సభ్యులు మాత్రం ఆయన కోమాలో ఉన్నాడన్న కారణంతో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరపలేదు.
మానసిక స్థితి స్థిరంగా లేని ఆయన భార్య తన భర్త కోమా నుంచి బయటకు వస్తాడన్న నమ్మకంతో రోజూ శరీరంపై గంగా జలాన్ని చల్లుతూ ఎదురుచూస్తోంది. కుటుంబ పెన్షన్ కోసం ఎటువంటి దరఖాస్తు రాకపోవడంతో ఐటి అధికారులు దర్యాప్తు చేయగా అసలు విషయం తెలియడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. మెజిస్ట్రేట్‌ను వెంట పెట్టుకుని పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం దీక్షిత్ ఇంటికి చేరుకున్నారు. అయితే దీక్షిత్ ఇంకా బతికే ఉన్నాడని, ఆయన కోమాలో ఉన్నాడంటూ కుటుంబ సభ్యులు వాదించడంతో వారికి నచ్చచెప్పి దీక్షిత్ మృతదేహాన్ని అధికారులు లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి దీక్షిత్ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై ముగ్గురు సభ్యుల బృందాన్ని నియమించి నివేదికను అందచేయాలని కోరినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అలోక్ రంజన్ తెలిపారు. ఇలా ఉండగా, దీక్షిత్ కుటుంబ సభ్యులు తరచు ఆక్సిజన్ సిలిండర్లను ఇంట్లోకి తీసుకెళ్లేవారని ఇరుగుపొరుగు వారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.