ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక శకటాలు
కాన్పూర్: అతిపెద్ద, అత్యధికులు సందర్శించే రావత్‌పూర్‌లోని రావే మోతీ మాల్‌లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆరు అగ్ని మాపక శకటాలను ఘటనా స్థలికి హుటాహుటిన తరలించారు. ఆ శకటాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం మాల్‌లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. కాగా మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మాల్ నుంచి దట్టమైన పొగలు పైకి ఎగిసేప్పుడు అందులో వందలాది మంది ఉన్నారు. అందరూ భయంతో పరుగులు పెట్టడంతో తోపులాట చోటుచేసుకుంది. మంటలను ఆర్పే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, మాల్‌ను ఖాళీ చేయించామని అగ్నిమాపక శాఖ తెలిపింది. ఇదిలావుండగా మొదటి అంతస్తుల మంటలు అదుపులోకి వచ్చాయని, రెండో అంతస్తులో మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీస్ డిప్యూటీ కమిషనర్(పశ్చిమం) బ్రిజేశ్ శ్రీవాస్తవ తెలిపారు. ‘ఇప్పటి వరకు ఎవరూ గాయపడలేదు. అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటో కూడా తెలియలేదు’ అని ఆయన చెప్పారు.
- Advertisement -