కాన్పూరు : ఈనెల 3 న కాన్పూర్‌లో జరిగిన హింసాకాండను సీరియస్‌గా తీసుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు 38 మందిని అరెస్టు చేసింది. సీసీటీవీ ఫుటేజ్‌లు, వీడియో క్లిప్‌ల ఆధారంగా అల్లర్లు, రాళ్లు రువ్వడం వంటి ఘటనలకు పాల్పడిన సుమారు 100 మందిని పోలీసులు గుర్తించారు. దీనికి తోడు కాన్పూరు హింసాకాండతో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న 40 మంది ఫోటోలతో కూడిన హోర్డింగ్‌లను అల్లర్లు జరిగిన ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. ఇందులో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సీనియర్ పోలీస్ ఆఫీసర్ల కాంటాక్ట్ ( ఫోన్ ) నెంబర్లు కూడా చేర్చారు. తద్వారా అనుమానితులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు పోలీసులకు తెలియచేసే వీలుంటుంది. సుమారు 20 కీలక నిందితుల ఫోటోలతో కూడిన 25 హోర్డింగులను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుమార్ తెలిపారు. అల్లర్లకు పాల్పడిన వారు తలదాచుకునేందుకు అవకాశమున్న అన్ని ప్రాంతాల్లోనూ గాలింపులు జరుపుతున్నామని, సాధ్యమైనంతవరకు నిందితులను పట్టుకుంటామని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ ప్రకాష్ తివారీ చెప్పారు.