నాగర్ కర్నూల్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ మండలం దేశి ఇటిక్యాలలో కంటి వెలుగు పరీక్షలు చేసుకుంటూ గుండెపోటుతో మొగులాల్ అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
ప్రభుత్వం కంటి వెలుగు పరీక్షలు కార్యక్రమాన్ని చేపట్టగా కంటి పరీక్షలు చేసుకునేందుకు మొగులాల్ వ్యక్తి కంటి పరీక్షల కేంద్రం దగ్గరికి వచ్చాడు.
కంటి చూపు పరీక్షలు నిర్వహిస్తుండగా ఒకసారిగా చాతి నొప్పితో విలవిలాడాడు. అక్కడే ఉన్న వైద్యులు ప్రథమ చికిత్స చేసి నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం బాధితుడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా మొగులాల్ అనారోగ్యంతో ఉన్నట్లు, తరచు ఫిట్స్ వస్తు ఇబ్బందులు పడేవాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆసుపత్రి నుండి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొని స్వగ్రామానికి తిరిగి వెళ్లారు.