Monday, December 23, 2024

కోటిన్నర పరీక్షల కంటి వెలుగు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ఇటీవల మరొక మైలు రాయిని దాటింది. కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శం. ఎందుకంటె రాష్ట్రంలో కంటివెలుగు పరీక్షల సంఖ్య కోటిన్నర దాటింది. 100 రోజుల్లో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలని ప్రభుత్వం భావిస్తే, కేవలం 80 రోజుల్లోనే కోటిన్నర మార్కును దాటి, సరికొత్త రికార్డు సృష్టించారు. రెండో విడతలో మే, 24 రాష్ట్ర వ్యాప్తంగా 1.52 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 71.71 లక్షల మంది పురుషులు, 80.71 లక్షల మంది మహిళలు ఉన్నారు. కంటి వెలుగు తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు, మందులను అందజేస్తుంది.

రాష్ట్రంలోని పౌరులందరికీ కంటి స్క్రీనింగ్, విజన్ పరీక్షను నిర్వహించడం కంటి అద్దాలను ఉచితంగా సమకూర్చడం, సర్జరీలు, ఇతర చికిత్సలను ఉచితంగా ఏర్పాటు చేయడం సాధారణ కంటి వ్యాధులకు మందులను సమకూర్చడం హానికరమైన కంటి వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్న కంటి వెలుగు పథకం నేడు సత్ఫలితాలు ఇస్తుంది. స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుడా ఈ కార్యక్రమాన్ని ప్రశంసించి, ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో కూడా అమలు చేయడానికి ప్రణాళికలను ప్రకటించారని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోని పేదలకు ఉపయోగపడుతుందని, అందుకే ఢిల్లీతో పాటు పంజాబ్‌లోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పడం ఈ పథకం ప్రాధాన్యతని వివరిస్తుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25% మంది ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్నారు,

అందులో దాదాపు కంటి వ్యాధులు సంఖ్య శుక్లాలు 43 శాతం, బాల్యంలో అంధత్వం ఉన్నవారు 4 శాతం, నెలలు నిండని శిశువులకు సమస్యలు 4 శాతం, డయాబెటిక్ రెటీనోపతి ఉన్నవారు 7 శాతం, చూపు మందగించడం 3 శాతం, నీటి కాసులు (గ్లకోమా) ఉన్నవారు 7 శాతంగా ఉన్నారు. 2018లో మొదటి విడతలో సుమారు 8 నెలల పాటు కొనసాగిన ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఒక లక్షా యాభై వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి రికార్డులో నిలిచింది. అధికారిక సమాచారం ప్రకారం 2021, జనవరి 1 వరకు తెలంగాణలో కంటి వెలుగు పథకం ద్వారా 38 లక్షల మంది లబ్ధిదారులకు సహాయం అందించబడింది. మొత్తం మీద 23,43,643 మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వబడ్డాయి. ఈ ఏడాది జనవరి 18న ఖమ్మంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా అప్పటి నుంచి శని, ఆదివారాలు సెలవు దినాల్లో తప్ప ఇతర రోజుల్లో నిరాటంకంగా కొనసాగుతున్నది.

కంటి పరీక్షల నిర్వహణలో రాష్ట్ర వ్యాప్తంగా 1,500 ప్రత్యేక బృందాలు శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు అనుకున్న లక్ష్యంలో సుమారు 88 శాతం పూర్తయ్యింది. కంటి వెలుగులో భాగంగా రాష్ట్రంలో 18 ఏండ్లకు పైబడిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వంద పని దినాల్లో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలని సంకల్పించారు. అయితే 80 రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఈ కార్యక్రమంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుంది. ఈ కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం అవటానికి, ప్రజల నుంచి అనూహ్య స్పందన ప్రధాన కారణం ఎందుకంటె చాలా మంది నేడు అనేక కంటి సమస్యలతో బాధపడుతున్నారు, ప్రైవేటు హాస్పిటల్‌లో వైద్యం చేసుకోలేని సందర్భంలో ప్రభుత్వమే నేరుగా కంటి పరీక్షలు నిర్వహించి, వారికి కావాల్సిన సూచనలు ఇవ్వటం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. కోటిన్నర ప్రజలకు పరీక్షలు నిర్వహణ వైద్య సిబ్బంది,

అన్ని విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే సాధ్యమైంది. ఇప్పటి వరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో పురుషులతో పోల్చుకుంటే మహిళల సంఖ్య అధికంగా ఉంది. కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలో ప్రజలందరికీ పరీక్షలు చేసి త్వరలోనే గిన్నిస్ బుక్ రికార్డ్‌లో వస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇలాంటి వినూత్న ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయి. ఇది వరకే ఈ కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ వైఎస్‌ఆర్ కంటి వెలుగు అనే కార్యక్రమం అమలు చేస్తున్నారు. అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయటానికి సన్నాహాలు చేస్తున్నాయి. కంటి వెలుగు కార్యక్రమం అమలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందికి హాట్సాఫ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News