Monday, January 20, 2025

సాంస్కృతిక విప్లవ సృష్టికర్త కానూరి

- Advertisement -
- Advertisement -

కానూరి వెంకటేశ్వరరావు బుర్రకథకి విస్తృత ప్రాచుర్యాన్ని తీసుకువచ్చి సాంస్కృతిక రంగంలో సరికొత్త చరిత్రని సృష్టించారు. ఉద్యమ లక్షసాధన కోసం ఆయన ‘బుర్రకథ’ని విరివిగా ఉపయోగించారు. ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్‌సింగ్ చరిత్రలను ఆయన బుర్రకథలుగా మలిచారు. అలాగే జార్జిరెడ్డి, విప్లవ సింహం రామనర్సయ్య, కాచనపల్లి అమరవీరుల రక్తగానం, నెల్లిమర్ల కార్మికుల పోరాట బుర్రకథలు ఆయన రాశారు. అలాగే యక్షగానాలు, ఒగ్గు కథలు, హరికథ, చిందు భాగవతం, పిట్టలదొర మొదలైన ఎన్నో రకాల కళారూపాలను ప్రజలను చైతన్యపరచడానికి ఆయన ప్రదర్శించారు.

తెలుగు నేలలో సాంస్కృతిక రంగంలో ఎన్నటికీ చెరగని తనదైన ముద్ర వేసిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు కానూరి వెంకటేశ్వరరావు. 1916లో కృష్ణా గుడివాడ తాలూకా కోడూరు గ్రామంలో పేద రైతు కుటుంబంలో మాణిక్యమ్మ, సిద్దయ్య దంపతులకు జన్మించారు. ఆయన చిన్ననాటి నుండి జానపద కళారూపాలపై ముఖ్యంగా భజనలు, బుర్రకథ, పాట, పౌరాణిక నాటకాలు, పద్యాలు మొదలైన వాటి పట్ల ప్రత్యేక ఆసక్తిని పెంచుకొని సాంస్కృతిక కళాకారునిగా ఎదిగారు. బుర్రకథలు, పాటలు, గేయ రూపకాలు, నాటకాలు, నాటికలు రాయడం, పాడడంలో ఆయనకు మరెవరూ సాటిరారు అని చెప్పవచ్చు.

1943లో కోడూరులో పున్నయ్య దళం ప్రదర్శించిన కష్టజీవి అనే బుర్రకథ ప్రభావంతో ఆయన ప్రజానాట్యమండలి సాంస్కృతిక సంస్థ నిర్వహించే ప్రదర్శనల పట్ల ఆకర్షితులయ్యారు. 1944లో విజయవాడలో నిర్వహించిన ప్రజానాట్యమండలి బుర్రకథ శిక్షణా శిబిరం ద్వారా ఆయన బుర్రకథ కళాకారునిగా రంగప్రవేశం చేసి వాటి ద్వారా అనేక ఉద్యమాలకు ఊపిరిపోశారు. కానూరి వెంకటేశ్వరరావు 1945లో ప్రజానాట్యమండలిలో చేరి 1950 వరకు క్రియాశీలకంగా పని చేశారు. 1946లో తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా ఆయన అనేక కళాప్రదర్శనలు నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ పై తీవ్ర నిర్బంధం ఉన్న కాలంలో ఆయన అజ్ఞాత జీవితాన్ని అనుభవించారు.

కానూరి వెంకటేశ్వరరావు 1956 లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు తాలూకా ఘనపురం గ్రామానికి వలసవెళ్లి వ్యవసాయ జీవితాన్ని ప్రారంభించారు. 19601970 కాలంలో ఆయన ‘ప్రగతి బాగోతం’ అనే నాటకాన్ని రాసి పల్లెల్లో విస్తృతంగా ప్రదర్శించారు. 1968 నుంచి ఆయన క్రమంగా విప్లవపథం వైపు పయనించారు. 1970 జులై 4న హైదరాబాద్‌లో విరసం స్థాపితం కాగానే కానూరి వెంకటేశ్వరరావు అందులో చేరి సాంస్కృతిక సేనానిగా పని చేశారు. బుర్రకథలు, నాటికలు, నాటకాలు మొదలై కళారూపాలను ఆయన విప్లవ రచయితల సంఘం సభ్యులకు నేర్పారు. 1974లో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ సహకారంతో కానూరి వెంకటేశ్వరరావు ‘అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య’ ను నెలకొల్పారు. బుర్రకథలో హాస్యం చెప్పడంలో ఆయన సమయస్ఫూర్తి అనన్యసామాన్యం. వ్యంగ్యాన్ని మేళవించి వర్తమాన రాజకీయాలపై కానూరి వెంకటేశ్వరరావు రాసిన పాటలు ఎంతో ఖ్యాతి గడించాయి. ఆయన వ్యంగ్య రచయితగాను కూడా కీర్తింపబడి బహుళ ప్రచారం పొందారు. ఆ రకంగా ఆయన ఎందరికో కళారంగపు మెలకువలు నేర్పి సాంస్కృతిక వారసత్వానికి వారధిగా నిలిచారు.

ప్రఖ్యాత గాయకులుగా గుర్తింపు పొందిన అరుణోదయ రామారావు, విమలక్కలు ఆయన శిక్షణలో ఉత్తమ కళాకారులుగా రూపుదిద్దుకోవడం గమనార్హం. కానూరి వెంకటేశ్వరరావు ‘కథకాని కథ’ అంటూ తన జీవిత చరిత్రను తానే స్వయంగా రాసుకున్నారు. ఆయన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యతో పాటు విభిన్న సాంస్కృతిక సంఘాలలో సమాంతరంగా కొనసాగారు. తెలంగాణ సాయుధ పోరాటంలో సాంస్కృతిక కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించి ఏడు దశాబ్దాల పాటు సాంస్కృతికోద్యమానికి సేవలు చేసి ‘కానూరి తాత’గా పేరు పొందిన కమ్యూనిస్ట్ కురువృద్ధుడు కానూరి వెంకటేశ్వరరావు ఎంతో మంది కళాకారులకు పురుడుపోసి తన అనుభవాలను రంగరించి మూడు తరాలకు పంచి 2015 ఏప్రిల్ 10నాడు తన 99వ యేట ఖమ్మంలోని సి.పి.ఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ కార్యాలయంలో కన్నుమూశారు. నేడు ఆయన లేని లోటు సాంస్కృతిక రంగంలో చాలా సృష్టంగా కనిపిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

కానూరి వెంకటేశ్వరరావు తన ప్రజా జీవితకాలపు ప్రారంభం తుది శ్వాస దాకా సాంస్కృతిక రంగంలో ప్రజా కళాకారుడుగా అంకితభావంతో కొనసాగారు. ఆయన ఖమ్మంలోని సి.పి.ఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో చనిపోయినప్పుడు తనకేమీ మిగుల్చుకోకుండా కేవలం సంచిలో ‘కళా సాహిత్యం’ మాత్రమే కలిగి ఉండడం అతి సామాన్య, నిరాడంబర జీవితానికి అద్దం పడుతుంది. కానూరి వెంకటేశ్వర రావు విప్లవ సాంస్కృతిక జీవితం మొత్తం పార్టీ కార్యాలయంలోనే సాదాసీదాగా గడిచిపోవడం చాలా అరుదైన విషయం. ఆయన స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ ని నిరాకరించారు. అతి నిరాడంబర జీవితాన్ని గడిపిన కానూరి వెంకటేశ్వరరావు విప్లవ సాంస్కృతిక రంగంలో నిఖార్సయిన కార్యకర్తగా జీవించి ఎందరికో మార్గదర్శిగా నిలిచారు అని చెప్పవచ్చు.

జె.జె.సి.పి. బాబూరావు 94933 19690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News