హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఘోర ఓటమిని చవి చేసిన విషయం తెలిసిందే. దీంతో బిసిసిఐ కీలక ప్రకటన జారీ చేసింది. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులకు పరిమితులు విధిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకోవడంతో కొందరు మాజీ ఆటగాళ్లు విమర్శలు చేయగా మరికొందరు సమర్థించారు. దేశవాళీ క్రికెట్‌లో బిసిసిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవడము మంచిదేనని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తెలిపారు. టీమిండియా టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 12 సంవత్సరాల తరువాత వారు రంజీ ట్రోఫీ ఆడుతున్నారని, అది సరైన విషయం కాదన్నారు. ఇటీవల ఫామ్ సరిగా లేకపోవడంతో ఆడారనడం సరికాదన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణించనా, రాణించకపోయినా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేశారు. డొమిస్టిక్ క్రికెట్ విషయంలో బిసిసిఐ కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. క్రికెటర్లు కుటుంబ సభ్యులతో వెళ్తే ఆటపై ప్రభావం చూపుతుందనే వాదన సరైంది కాదన్నారు. భార్యలను పర్యటనలకు తీసుకెళ్లడంలో తప్పు లేదని, కానీ పరిమితమైన సమయం ఇవ్వాలని వివరించాడు. నెల రోజుల టూర్ ఉంటే 20 రోజులు కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వకపోవడంతో సహచర క్రికెటర్లతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారని పేర్కొన్నారు. జట్టు సభ్యులతో కలిసి ప్రయాణం చేయడం వలన ఆటపై మంచి ప్రభావం పడుతుందన్నారు. క్రికెట్ అనేది వ్యక్తిగతమైన క్రీడ కాదని కపిల్ తెలియజేశారు.