Sunday, December 29, 2024

గాంధీ కుటుంబంపై కపిల్ సిబల్ విమర్శలు

- Advertisement -
- Advertisement -

Kapil Sibal
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రిబెల్ నేత కపిల్ సిబల్ తన వ్యతిరేక గళాన్ని మరోసారి వినిపించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కానప్పటికీ నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతైనా పార్టీ నాయకత్వ మార్పునకు ‘గాంధీలు’ నడుం బింగించాలన్నారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా లేరని ఆయన ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. తాను తన చివరిశ్వాస వరకూ ‘సబ్‌కీ కాంగ్రెస్(అందరి కాంగ్రెస్)’ కోసం పోరాడుతానని, ‘ఘర్‌కీ కాంగ్రెస్(కుటుంబ కాంగ్రెస్)’ను వ్యతిరేకిస్తానని అన్నారు. తనలాంటి ఎంతో మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి)లో లేకున్నా పార్టీలో ఉన్నామని స్పష్టం చేశారు.
ఇదిలావుండగా రాహుల్ గాంధీకి పూర్తి విశ్వాసపాత్రుడైన, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ విప్ అయిన మణికం టాగుర్… కపిల్ సిబల్ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి భాషను మాట్లాడుతున్నారని అన్నారు. పార్టీ నాయకత్వం నుంచి గాంధీలను తప్పించాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కోరుకుంటున్నాయన్నారు. వారు కాంగ్రెస్ పార్టీని, భారత్ భావనను నాశనం చేయాలనుకుంటున్నారని కూడా అన్నారు.
‘ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నెహ్రూగాంధీ కుటుంబాన్ని ఎందుకు నాయకత్వం నుంచి తప్పించాలనుకుంటున్నాయి? ఎందుకంటే గాంధీ నాయకత్వం లేకుంటే కాంగ్రెస్ పార్టీ చివరికి జనతా పార్టీ అయిపోగలదు. భారత భావనను చంపేకన్నా కాంగ్రెస్‌ను మట్టుపెట్టటం చాలా సులువు’ అని టాగుర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘కపిల్ సిబల్‌కు అది తెలుసు, కానీ ఆయన ఎందుకు బిజెపి/ఆర్‌ఎస్‌ఎస్ భాషను మాట్లాడుతున్నారు’ అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సిడబ్లుసి సమావేశం తర్వాత తమ పార్టీ మాజీ నాయకుల వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘మేము పోరాడుతాం, మేము తిరిగొస్తాం. మేము మీ గళాన్ని వినిపిస్తాం’ అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News