Sunday, December 22, 2024

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Kapil Sibal resigns from Congress party

సమాజ్ వాది మద్దతుతో రాజ్యసభకు నామినేషన్

న్యూఢిల్లీ : పరాజయాల పరంపరతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ సంస్కరణలకు సిద్ధమవుతున్న వేళ ఆ పార్టీకి తాజాగా మరో పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేత , కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీని తాను విడిచిపెట్టినట్టు స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా సమాజ్ వాది పార్టీ మద్దతుతో రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. మే 16 నే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. “ పార్లమెంటులో స్వతంత్ర గళం ఉండటం ఎంతో ముఖ్యం. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పుడే ఎటువంటి రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని మన గళాన్ని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశాను ” అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కపిల్ సిబల్‌కు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. దీంతో సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే కపిల్ నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ … “కపిల్ సిబల్‌తోపాటు మరో ఇద్దరు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది. సీనియర్ లాయర్ అయిన కపిల్ సిబల్ పార్లమెంట్‌లో తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగలరు.

ఆయన వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ అభిప్రాయాలను కూడా పార్లమెంటులో వెల్లడిస్తారని ఆశిస్తున్నాం ” అని పేర్కొంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న కపిల్ సిబల్ పదవీ కాలం జులైలో ముగుస్తుంది. అయితే 2016 లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన సిబల్‌కు అప్పుడు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మద్దతు తెలిపింది. ప్రస్తుతం యూపీలో కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే మిగిలాయి. దీంతో కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం లేదు. ఇదే సమయంలో కపిల్ సిబల్‌కు సమాజ్‌వాదీ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ తరఫున సుప్రీం కోర్టులో సిబల్ వాదనలు వినిపించారు. రెండేళ్ల తరువాత ఆయనకు బెయిల్ లభించింది. దీంతో అజంఖాన్ ఇటీవలనే జైలు నుంచి విడుదలయ్యారు. ఇందుకు కపిల్ సిబల్ కృషి చేసినందునే ఆయనకు సమాజ్‌వాదీ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ రెబల్‌గా…
కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులపై కపిల్ సిబల్ బహిరంగంగానే తన గళాన్ని వినిపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ రెబల్‌గా మారిన జి23 బృందం లోనూ కపిల్ సిబల్ ఉన్నారు. పార్టీ మొత్తం గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉండటాన్ని వ్యతిరేకిస్తోన్న ఆయన … అధ్యక్షుడు కానప్పటికీ నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీయే తీసుకుంటారని పలుమార్లు విమర్శించారు. ఇలా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కపిల్ సిబల్ చివరకు పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News