వైరస్‌తో ఒకరి మృతి, మరొకరికి నిర్ధారణ
లక్నో: డెల్టా ప్లస్ వేరియంట్ రేపినఆందోళన ఇంకా సమసి పోకముందే తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్ ‘కప్పా’ పాజిటివ్ నిర్ధారణ అయిన ఓ వ్యక్తి మరణించాడు. ఇతడిని సంత్‌కబీర్ జిల్లా వాసిగా అధికారులు నిర్ధారించారు. ఇదే వేరియంట్ కు సంబంధించి మరో కేసు కూడా నిర్ధారణ అయినట్లు అధికారులు చెప్పారు. అయితే వివరాలు వెల్లడించలేదు. జూన్ 13న రొటీన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలో భాగంగా సేకరించిన నమూనాల్లో దీన్ని గుర్తించారు. అనంతరం వీటి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం న్యూఢిల్లీలోని సిఎస్‌ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీకి పంపించారు. మే17 కోవిడ్19కు పాజిటివ్ నిర్ధారణ రాగా, జూన్ 12న గోరఖ్‌పూర్‌లోని బిఆర్‌డి మెడికల్ కాలేజికి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ జూన్ 14న మరణించాడని, కాలేజి మైక్రో బయాలజీ విభాగం అధిపతి అమ్రేష్ సింగ్ ధ్రువీకరించారు.
107 శాంపిల్స్‌లో కొవిడ్19కు చెందిన డెల్టాప్లస్ వేరియంట్‌ను గుర్తించగా, రెండుశాంపిల్స్‌లో కప్పా వేరియంట్ కనిపించినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రొటీన్‌గా నిర్వహించే సమీక్షా సమావేశంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే ఈ రెండు వేరియంట్లు రాష్ట్రానికి కొత్తేమీ కాదని, జీనోమ్ సీక్వెన్సింగ్ సదుపాయాన్ని మరింత విస్తరిస్తున్నామని ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ అబిత్ మోహన్ ప్రసాద్ సింగ్ చెప్పారు. కప్పా వేరియంట్ గురించి అడగ్గా ఇంతకు ముందు కూడా రాష్ట్రంలో ఈ వేరియంట్ కనిపించిందని, దీనికి చికిత్స సాధ్యమని ఆయన చెప్పారు.