జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్మీత్ సింగ్ కూనెర్ అస్వస్థతతో కన్నుమూశారు. ఢిల్లీ లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు పార్టీ నేతలు బుధవారం తెలిపారు. 75 ఏళ్ల కూనెర్ ప్రస్తుతం కరణ్‌పూర్ సిట్టింగ్ ఎమ్‌ఎల్‌ఎగా ఉన్నారు. ఈ నెల 4న నామినేషన్ దాఖలు చేసిన ఆయన ఈనెల 12న ఎయిమ్స్‌లో చేరారు. రక్తపోటు, మూత్రపిండాలు దెబ్బతినడంతో కూనెర్ మృతి చెందినట్టు ఎయిమ్స్ జారీ చేసిన మరణధ్రువీకరణ పత్రంలో పేర్కొంది. గుర్మీత్ సింగ్ కూనెర్ మృతికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతాపం తెలియ జేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. ఇప్పుడు ఈ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.
కరణ్‌పూర్ ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎగా ఉన్న ఆయన 2018 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. బీజేపీకి చెందిన సురేంద్రపాల్ సింగ్, పృథివాల్ సింగ్ సంధులను ఓడించారు. ఈ సారి కూడా ఈ ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పుడు 199 స్థానాలకు మాత్రమే నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి పోలింగ్ ముందు చనిపోతే ఆ స్థానానికి రిటర్నింగ్ ఆఫీసర్‌ఎన్నిక వాయిదా వేస్తారని ఆ తరువాత నోటిఫై చేయడమౌతుందని ఎన్నికల కమిషన్ అధికారి తెలిపారు. అయితే చట్టం లోని సెక్షన్ 52(2) ప్రకారం ఎన్నికల కమిషన్ ఆ పార్టీని ఏడు రోజుల్లో వేరే అభ్యర్థిని నియమించాలని అడుగుతుందని తెలిపారు. ఈ స్థానానికి తాజా తేదీని ఎన్నికల కోసం కమిషన్ ప్రకటిస్తుందని చెప్పారు.