న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షులుగా పదవీబాధ్యతలు చేపట్టి సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే ఏడాది పూర్తి చేసుకున్నారు. ఆయన సారథ్యంలో పార్టీ గణనీయ పురోగతి సాధించిందని పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవస్థను ఆయన మరింతగా తీర్చిదిద్దారని, పటిష్టపర్చారని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ సామాజిక మాధ్యమంలో పేర్కొంది. చిరకాలం తరువాత కాంగ్రెస్‌జరిగిన అధ్యక్ష పదవీ ఎన్నికల్లో కర్నాటకకు చెందిన ఈ వయోవృద్ధ అలుపెరుగని నేత కాంగ్రెస్ ఎంపి శశిథరూర్‌ను ఓడించారు. దీనితో పార్టీలో గాంధీ కుటుంబ శకం అధికారికంగా ముగిసింది.
2022 అక్టోబర్ 26వ తేదీన ఖర్గే పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. ప్రజల మంచికోసం కట్టుబడి పనిచేసే వ్యక్తిత్వం ఖర్గేది. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ప్రాతిపదికలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, సమిష్టి ప్రగతి, దేశభక్తివంటి విలువలను ఆయన సంతరించుకున్నారని పార్టీ కొనియాడింది. తాను నమ్మిన ఆదర్శాల కోసం పోరాడే భయం లేని నేత అని తెలిపారు. పలువురు పార్టీ నేతలు ఖర్గేకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. శ్రీ ఖర్గేజీకి ప్రణామ్ అంటూ శశి థరూర్ ట్వీటు వెలువరించారు. రాబోయే ఎన్నికల యుద్ధాలలో ఆయన ఆధ్వర్యంలో పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.