Wednesday, January 1, 2025

మందకొడిగా ఖరీఫ్!

- Advertisement -
- Advertisement -
34శాతం విస్తీర్ణంలోనే విత్తనం
పత్తి మినహా మిగిలిన పంటలు 11లక్షల ఎకరాల్లోపే

హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సీజన్ మందకోడిగా కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల రాకలో జరిగిన జాప్యం పంటల సాగు విస్తీర్ణపు లక్ష్యాలను ప్రభావితం చేస్తోంది. వానాకాలం ప్రవేశించి నెలన్నర రోజులు కావస్తున్నా రాష్ట్రంలో వర్షపాతం పరిశీలిస్తే ఇప్పటివరకూ సరైన వర్షాలే కురవలేదు. రాష్ట్రంలో ఈ సీజన్‌కు సంబంధించి ఈ సమయానికి 206.2మి.మి వర్షపాతం నమోదు కావాల్సివుండగా ఇప్పటివరకూ 156 మి.మి సగటు వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకూ 11జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఇంకా 22జిల్లాలు లోటు వర్షపాతంలోనే నెట్టుకొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పంటల సాగు ఆగి ..ఆగి సాగుతోంది. రాష్ట్రంలో ఖరీఫ్‌పంటల సాగు ప్రణాళిక మేరకు అన్ని పంటలు కలిపి ఈ సీజన్‌లో కోటి 24లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది.

సీజన్ ప్రారంభం నుంచి ఈ సమయానికి 59.53లక్షల ఎకరాల్లో విత్తనాలు వేయాల్సివుంది. అయితే ఇప్పటివరకూ 42.76లక్షల ఎకరాల్లోనే విత్తనాలు వేశారు. సాధారణ పంటల సాగు విస్తీర్ణంలో ఇది 34.41శాతం మించిలేదు. గత ఏడాది ఇదే సమయానికి 50.90లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి.
పత్తి మినహాయిస్తే మిగిలిన పంటలు 11లక్షలు లోపే !
రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగుకు వాతావరణం అంతగా అనుకూలించటం లేదు. ఇప్పటి వరకూ సాగులోకి వచ్చిన పంటల్లో పత్తి సాగు విస్తీర్ణతను అటుంచితే , మిగిలిని ప్రధాన ఆహారా ధాన్య పంటలు , పప్పుధాన్యపంటలు ,నూనెగింజ పంటలు కలిపి వాటి విస్తీర్ణం 11లక్షల ఎకరాలలోపే వుంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 42.76లక్షల ఎకరాలు సాగులోకి రాగా అందులో 31.88లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం పడింది. మిగిలిన అన్ని రకాల పంటలు కలిపి 10.88లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. పత్తి సాగు కూడా మందకోడిగానే సాగుతోంది. ఈ ఏడాది 60లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేయించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఈ సమయానికి 38.46లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి విత్తనం పడాల్సివుంది. ఇప్పటివరకూ ఈ పంట సాగువిస్తీర్ణపు లక్ష్యాలు 63.02శాతం వద్దనే ఉన్నాయి. పత్తి విత్తనాలు వేసుకునేందుకు అదను కాలం కూడా ముగిసిపోవస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఆరు శాతం దాటని వరి విస్తీర్ణం
రాష్ట్రంలో పత్తి సాగు తర్వాత అంతకు మించిన ప్రాధాన్యం ఉన్న వరిసాగుకు ఈసారి కాలం కలిసి రావటం లేదు. నీటి వనరులు అందుబాటులో లేకపోవటంతో వరి నార్లు పోసేందుకు కూడా వీలు కావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్‌లో 50లక్షల ఎకరాల్లో వరిసాగును ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఇప్పటి వరకూ వరిసాగు విస్తీర్ణపు లక్ష్యాలు ఆరు శాతం మించలేదు. ఈ సమయానికి 4.40లక్షల ఎకరాల్లో వరినాట్లు పడాల్సివుంది. అయితే ఇప్పవరకూ 2.95లక్షల ఎకరాల్లోనే వరి సాగులోకి వచ్చింది.మిగిలిన ప్రధాన ఆహార పంటలకు సంబంధించి 11130 ఎకరాల్లో జోన్న విత్తనం పడింది. మొక్కజొన్న 1,68,781ఎకరాల్లో సాగు చేశారు. రాగి 37ఎకరాల్లో సాగు చేశారు. పప్పుధాన్య పంటలకు సంబంధించి ఈ సీజన్‌లో 9.43లక్షల ఎకరాలు లక్షంగా పెట్టుకోగా, ఇప్పటి వరకూ అందులో 30.51శాతం విస్తీర్ణంలోనే పప్పుధాన్యపంటలు సాగు చేశారు. ఈ సమయానికి 6.83 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ పంటలు సాగులోకి రావాల్సివుండగా , ఇప్పటివరకూ 2.87లక్షల ఎకరాల్లోనే ఈ పంటలు సాగులోకి వచ్చాయి. అందులో ప్రధానంగా 2.59లక్షల ఎకరాల్లో కంది విత్తనం పడింది. పెసర 21వేలు, మినుము 7429 ఎకరాల్లో సాగుచేశారు.
3.20లక్షల ఎకరాల్లో నూనెగింజ పంటలు
రాష్ట్రంలో ఈ సారి మిగిలిన పంటల విస్తీర్ణంతో పోలిస్తే నూనెగింజ పంటల సాగే కొంత మెరుగ్గా వుంది. ఈ సీజన్‌లో 5.19లక్షల ఎకరాల్లో నూనెగింజ పంటలు సాగు చేయించాలన్నది లక్షం కాగా ఇప్పటివరకూ నూనెగింజ పంటల విస్తీర్ణం 61.75శాతానికి చేరుకుంది. ఈ సమయానికి 3.92లక్షల ఎకరాల్లో విత్తనాలు వేయాల్సివుండగా, ఇప్పటివరకూ 3.20లక్షల ఎకరాల్లో నూనెగింజపంటలు సాగు చేశారు. గత ఏడాది కూడా ఈ సమయానికి ఇంతే విస్తీర్ణంలో ఈ పంటలు సాగులోకి వచ్చాయి. నూనెగింజ పంటల్లో ఇంత వరకూ సోయాబీన్ 3.19లక్షల ఎకరాల్లో సాగు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News