Sunday, December 22, 2024

కరీంనగర్ జిల్లాను ఫిషరీస్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: విస్తారమైన జల వనరులున్న కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఫిషరీస్ హబ్‌గా తీర్చిదిదుతామని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫిషరీస్ హబ్‌గా తీర్చిద్దేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దానికి అనుసంధానంగా నిర్మించిన రిజర్వాయర్లు వరద కాలువ గోదావరి గర్భాన్ని నీటి నిలువ కాలువగా వినియోగించడం మిషన్ కాకతీయ తదితర చర్యల ఫలితంగా కరీంనగర్ జిల్లాలో నీటి వనరుల సౌలభ్యం గరిష్ట స్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. దాంతో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు తదితర సాంప్రదాయ జలవనరుల ఫలితంగా చేపల ఉత్పత్తికి అనేక అవకాశాలు మెరుగు పడ్డాయని తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఎల్లంపల్లి, మిడ్‌మానేర్, లోయర్ మానేర్, తదితర జలాశయాలతో పాటు గోదావరి నదిపై కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీలతో జలవనరులు పెరిగాయన్నారు. మేడిగడ్డ నుండి శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు వరకు సుమారు 150 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న గోదావరి నది గర్భంలో నీటి వనరులకు కొదువ లేదన్నారు. వీటికి అనుసంధానంగా అందుబాటులోకి వచ్చిన సుమారు 122 కిలోమీటర్ల పొడవైన వరద కాలువ, గోదావరి ఉపనదిగా ఉన్న మానేరు ఉపనదిపై నిర్మించగలబెట్టిన అనేక చెక్‌డ్యాములు ఉండబోతున్నట్లు తెలిపారు.

ఇక సాంప్రదాయంగా అందుబాటులో ఉన్న వేలాది చెరువులు, కుంటలు తదితర జలవనరులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మత్స రంగంతో పాటు ఆక్వా కల్చర్ అభివృద్ధికి అనుకూలంగా మారిందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా సముద్ర జల వనరుల్లో జరిగే చేపల ఉత్పత్తి రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న కారణంగా ఉపరితల జల వనరులలో చేపల ఉత్పత్తికి అంతకంతకు ప్రాధాన్యం పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉపరితల జల వనరుల విస్తీర్ణంలో దేశంలో మూడవ స్థానంలో ఉన్న మన రాష్ట్రం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో అదనంగా మరో లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో జల వనరులు పెరగడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలచిందని వెల్లడించారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో మత్సరంగం అభివృద్ధికి అవకాశాలు విస్తృతంగా పెరిగాయని, ఉమ్మడి కరీంనగర్‌జిల్లా లాంటి ప్రాంతాల్లో ఫిషరీస్ హబ్‌ను రూపొందించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మత్స రంగాన్ని ఆధునిక విధానాలతో మేళవించి ఆక్వాకల్చర్‌తో అనుసంధానం చేయడం ద్వారా చేపల ఉత్పత్తిని, ఉత్పాదకతను ఇబ్బడి ముబ్బడిగా పెంచేందుకు విస్తారమైన అవకాశాలున్నాయన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పరిధిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆధునిక పద్దతులలో చేపలను పెంచేందుకు వీలున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధానాలు అమలు చేయడం ద్వారా మత్స రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విశేషంగా పెంపొందించేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News