దక్షిణభారతదేశంలో 100% 2 డోసులు పూర్తి చేసిన రెండో జిల్లాగా రికార్డు
రాష్ట్రంలో తొలి జిల్లాగా నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యాక్సినేషన్‌లో కరీంనగర్ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్ పంపిణీ 100 శాతం పూర్తయింది. తద్వారా రాష్ట్రంలో రెండు డోసులు 100 శాతం పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకున్నది. జిల్లాలో 7,92,922 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించగా, మొదటి డోస్ లక్ష్యానికి మించి 104 శాతం మందికి వేశారు. ఇప్పటివరకు 8,27,103 డోసులు పంపిణీ చేశారు. ఇదే స్ఫూర్తితో సెకండ్ డోస్ సైతం రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. మంగళవారం నాటికి జిల్లాలో 7,94,404 మందికి రెండో డోస్ పంపిణీ చేసి 100 శాతం అధిగమించిన తొలి జిల్లాగా రికార్డు సృష్టించారు. దక్షిణాది రాష్ట్రాల్లో రెండు డోసులు పూర్తయిన జిల్లాగా బెంగళూరు అర్బన్ మొదటి స్థానంలో నిలువగా, కరీంనగర్ రెండో స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
అన్ని జిల్లాలు వందశాతం దిశగా
మొదటి డోస్ విషయంలో తెలంగాణ ఇప్పటికే 100 శాతం లక్ష్యాన్ని అధిగమించిన సంగతి తెలిసిందే. జిల్లాల వారీగా పరిశీలించగా.. నిజామాబాద్, సూర్యాపేట, కామారెడ్డి,కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వందశాతం పూర్తయితే అన్ని జిల్లాలు వందశాతం పూర్తయిన రికార్డు సొంతం కానున్నది. రాష్ట్రంలో 18 ఏండ్లకు పైబడి 2.77 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం లక్ష్యం నిర్ధారించగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటిడోస్ 2.88 కోట్ల మందికి వేశారు. లక్ష్యానికి మించి 104 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది.