Monday, January 20, 2025

ఆపదలో ఉన్న మహిళను కాపాడిన కరీంనగర్ సఖి టీం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ క్రైం: ఆపదలో ఉండి ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ మహిళను కరీంనగర్ సఖి టీం కాపాడింది. ఆమె వివరాలను సేకరించి న్యాయ సహాయం అందిస్తోంది. ఈ నెల 16న కొత్తపల్లి మండలం చింతకుంట ఏరియా అంగన్‌వాడీ టీచర్ నుండి కాల్ సెంటర్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది.

ఓ మహిళ ఆపదలో ఉందన్న ఫోన్ కాల్ అందుకున్న సఖి సిబ్బంది వెంటనే ఆమెను రెస్కూ చేశారు. చింతకుంటలోని శ్రీరాములపల్లి కాలనీలో ఓ మహిళ ఒంటరిగా ఉందని, దిక్కుతోచని స్థితిలో అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తోందని స్థానిక అంగన్‌వాడీ టీచర్ కరీంనగర్ సఖి కాల్ సెంటర్‌కు ఫోన్ చేసింది. దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆమె నుండి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఆమెకు మాటలు రావని, చెవులు వినపడవని తెలుసుకున్న సఖి టీం బధిరుల ఆశ్రమ పాఠశాల నుండి నిపుణులను రప్పించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు.
ఆమె పేరు స్వప్న అని మాత్రమే తెలిపిన మహిళ వివరాలు వెల్లడించకపోవడంతో ప్రసారమాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఆ మహిళను తమ కూతురు స్వప్నగా గుర్తించిన తల్లిదండ్రులు సఖి టీంను సంప్రదించారు. స్వప్నది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామంగా గుర్తించారు. భర్త చిరంజీవి వేదించడంతో తాను ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. వివాహేతర సంబంధం కారణంగా తన కూతురిని అల్లుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారు సఖి సిబ్బందికి తెలియజేశారు. తన కూతురు గురించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపారు.

దీంతో ఫిర్యాదు కాపీ పరిశీలించిన సఖి సిబ్బంది స్వప్నను తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్ల సంక్షేమ అధికారి సిహెచ్ సంధ్యారాణి, సఖి అడ్మిన్ లక్ష్మి తల్లిదండ్రులతో మాట్లాడారు. స్వప్నకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సఖి ఆధ్వర్యంలో స్వప్నకు న్యాయ సహాయం అందిస్తామని, అవసరమైతే షెల్టర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వప్నను మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన భర్త చిరంజీవిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News