హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త మోసుకొచ్చింది. చాలాకాలంగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న కరీంనగర్- టు హసన్ పర్తి రైల్వేలైన్ సర్వేకు కేంద్ర రైల్వే బోర్డు ముందుకొచ్చింది. దీనిపై కేంద్ర రైల్వేబోర్డు సర్వేకు ఆమోదం తెలుపుతూ మే 8వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం రూ.1.54 కోట్లను సైతం విడుదల చేసింది. వాస్తవానికి కరీంనగర్- ఖాజీపేట రైల్వేలైన్ ఇప్పటిది కాదు. 1976లోనే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. కానీ, సర్వే, అంచనా వ్యయం తదితర విషయాల్లో ఎలాంటి పురోగతికి నోచుకోలేదు.
ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు స్వీకరించాక 1994లో ఈ ప్రాజెక్టు తిరిగి తెరమీదకు వచ్చింది. గతంలో ఈ ప్రాజెక్టును కరీంనగర్- ఖాజీపేటగా పిలిచేవారు. కరీంనగర్- హసన్పర్తి రైల్వేలైన్ అందుబాటులోకి వస్తే పాత వరంగల్- కరీంనగర్ జిల్లాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ- పశ్చిమ భారతదేశానికి ఈ రైల్వేలైన్ ఒక సంధానంగా నిలుస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర వెళ్తున్న కరీంనగర్, వరంగల్ ప్రజలకు దాదాపు 200 కి.మీ చుట్టూ తిరిగి వెళ్లాల్సిన ప్రయాణభారం తప్పుతుంది.
కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల ప్రజలకు..
ఈ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల ప్రజలు మహారాష్ట్రలోని ముంబై, గుజరాత్‌లోని అహ్మదాబాద్ వంటి ఇతర నగరాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలోని షిర్డీ, ఔరంగాబాద్, గుజరాత్‌లోని పలు పుణ్యక్షేత్రాలను కలిపే లైన్ కావడంతో పర్యాటక రంగ అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ఇప్పటికీ వరంగల్ నుంచి నిజామాబాద్‌కు రైలు సౌకర్యం లేదు.
కానీ, కరీంనగర్- టు పెద్దపల్లి రైల్వేలైన్ పూర్తి కావడంతో కరీంనగర్ వరకు రైల్వేలైన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు హసన్‌పర్తి నుంచి కరీంనగర్ వరకు లైన్ వేస్తే నిజామాబాద్ టు -వరంగల్ మధ్య ప్రయాణం సాకారమవుతుంది. ప్రస్తుతం కరీంనగర్ ప్రజలు హైదరాబాద్ వెళ్లాలంటే కరీంనగర్- టు హసన్‌పర్తి రైల్వేలైన్ పూర్తయితే నేరుగా ఖాజీపేటకు లైన్ అందుబాటులోకి వస్తుంది.