Thursday, January 23, 2025

కరీంనగర్ -హసన్‌పర్తి రైల్వేలైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ జిల్లాల వాసులకు శుభవార్త. దశాబ్దాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్ – హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అందులో భాగంగా కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి యుద్ద ప్రాతిపదికన రీ సర్వే చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరం నిధులు కేటాయింపుతో పాటు రైల్వేలైన్ నిర్మాణ పనులను ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కుమార్ న్యూఢిల్లీలో శుక్రవారం రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. కరీంనగర్- హసన్‌పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి వినతి పత్రం అందజేశారు. అదే విధంగా సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలో రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

2013లో కరీంనగర్ హసన్‌పర్తి రైల్వే మార్గానికి సంబంధించి సర్వే చేసినప్పటికీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ధిష్ట సమయంలోగా సరైన నిర్ణయం తీసుకోని కారణంగా రైల్వేలైన్ అంశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయిందని ఈ సందర్భంగా బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యుల్ లో -11 అంశం మేరకు తెలంగాణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి బండి సంజయ్ గుర్తుచేశారు. దాదాపు 62 కి.మీల మేరకు పనులు సాగే కరీంనగర్ – హసన్‌పర్తి ఈ రైల్వేలైన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని బండి సంజయ్ తెలిపారు. ప్రధాన ఉత్తర తెలంగాణలోని గ్రానైట్ ఇండస్ట్రీతోపాటు వరి, పప్పు ధాన్యాలు, పసుపు పంట ఉత్పత్తుల రవాణా సులువు కానుందని పేర్కొన్నారు. బండి సంజయ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారులను పిలిపించుకుని మాట్లాడారు.

యుద్ద ప్రాతిపదికన కరీంగనర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణంపై రీ సర్వేను నిర్వహించి పక్షం రోజుల్లో నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. రైల్వేశాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా త్వరలో వచ్చే నెలలో ప్రారంభించేందుకు తమవంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జునస్వామి భక్తులకు సౌలభ్యంగా ఉండేలా రైలు ఆగేలా ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్న కేంద్ర మంత్రి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వేలైన్ రీ సర్వేకు ఆదేశించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కరీంనగర్ – హసన్‌పర్తి రైల్వేలైన్ నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ రైల్వేలైన్ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని, దీనివల్ల ఇంతకాలం ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News