Monday, November 25, 2024

యాదమ్మ వంట రుచి చూడనున్న ప్రధాని

- Advertisement -
- Advertisement -

Karimnagar Yadamma Food Arrangements For PM Modi

వంటలు చేయనున్న కరీంనగర్ యాదమ్మ

హైదరాబాద్ : దేశ ప్రధానికి వండి వడ్డించడం అంటేనే కనీసం ఐదు నక్షత్రాల హోటల్లో చేయి తిరిగిన నలభీములు అయి ఉండాలి. కానీ, హైదరాబాద్ రానున్న ప్రధాని ఓ సామాన్య చేతి వంట రుచి చూడబోతున్నారు. ఆమె అతి సాధారణమైన మహిళ అయినా, రుచికరమైన తెలంగాణ వంటల తయారీలో మాత్రం అసామాన్యురాలు. వంటల తయారీలో అందెవేసిన చెయ్యి. అందుకే ఏరికోరి ఆమెను ఎంపిక చేశారు. జులై 2 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి అచ్చ తెలంగాణ వంటలు రుచి చూపించాలని నిర్ణయించారు. దీనికోసం కరీంంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపిక చేశారు. యాదమ్మ 29 సంవత్సరాలుగా వంటలు చేస్తూ జీవిస్తోంది.

యాదమ్మ స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామం. యాదమ్మకు 15 యేటనే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి అయ్యింది. దీంతో భర్తతో పాటు యాదమ్మ కరీంనగర్ చేరుకుంది. అక్కడే మంకమ్మతోటలో ఉండే వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు చాలా ఫేమస్. ఒక్కసారి రుచి చూసిన వారు ఆహా అనకుండా ఉండలేరు అని చెబుతారు. 500, 1000 మందికి కాదు ఏకంగా 10 వేల మందికి కూడా ఇట్టే వండి వార్చేస్తుంది యాదమ్మ. మంత్రులు కెటిఆర్, గంగుల కమలాకర్ పాల్గొన్న కార్యక్రమాలతో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించే సమావేశాలకు చాలాసార్లు వంటలు చేయడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. యాదమ్మను బుధవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‌కు పిలిపించారు. కొన్ని వంటలు తయారు చేయించుకుని రుచి చూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News