కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎల నిరసనల హోరు
బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎల నిరసనల మధ్యే కర్ణాటక అసెంబ్లీ గురువారం మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించింది. సామూహిక మత మార్పిడులకు పాల్పడే వారికి ఇకపై జైలు శిక్ష విధించే నిబంధనను ఇందులో పొందుపరిచారు. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందడంతో కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు నిరసనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లారు. ఈ బిల్లును కాంగ్రెస్‌తోపాటు క్రైస్తవ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. సభలో బిల్లును ప్రవేశ పెట్టిన తరువాత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ ఈ బిల్లును ఆర్‌ఎస్‌ఎస్ అజెండాగా అభివర్ణించారు.
దీనికి గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప స్పందిస్తూ ఇది దేశ సంస్కృతిని కాపాడడానికి తీసుకువచ్చిన బిల్లు అని స్పష్టం చేశారు. కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లు 2021 ప్రలోభాలకు గురిచేయడం ద్వారా కానీ బలవంతంగా కానీ, మోసపూరిత విధానాల ద్వారా కానీ, సామూహికంగా కానీ మతమార్పిడులను నిరోధిస్తుంది. దీనిని ఉల్లంఘించి ఎవరైనా మతమార్పిడులకు ప్రయత్నిస్తే ఐదేళ్ల జైలు శిక్ష రూ. 25 వేల జరిమానా విధిస్తారు. మైనర్లు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష రూ.50 వేలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. అంతేకాదు నాన్‌బెయిలబుల్ కింద కేసులు నమోదు చేస్తారు.