కన్నడనాట కమలనాథులు ఘోరంగ దెబ్బ తినబోతున్నారు. దక్షిణ భారత దేశానికి ప్రవేశ ద్వారం గా కర్ణాటకలో ప్రవేశించి తెలుగు రాష్ట్రాల మీదుగా తమిళనాడు, పాండిచ్చేరిలలో పాగా వేయాలనుకున్న కాషాయంబుదారులకు గడ్డు కాలం మొదలైంది. కిందటి ఎన్నికల్లో బోటాబొటీ మెజారిటీతో గద్దె నెక్కి కాంగ్రెస్ పార్టీని చీల్చి బలవంతంగా ఉప ఎన్నికలను ప్రజల మీద రుద్ది దక్షిణాదిన కాషాయం జెండా ఎగుర వేశామని సంబుర పడుతున్న మోడీ, అమిత్ షా ద్వయానికి అది మున్నాళ్ల ముచ్చట అని తేలిపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. పైగా విపక్షాలను చీలుస్తూ తాము బలపడుతున్నామని కమలనాధులు కాలర్ ఎగుర వేసినా ఖాతరు చెయ్యని జనం కర్ణాటకలో ఇప్పు డు కరప్షన్ అంశానికి ప్రాధన్యం ఇచ్చి బిజెపికి గుణపాఠం చెప్పబోతుండగా, మొదటి నుండి అదే పార్టీకి కొండంత అండ అనుకున్న కార్పొరేట్ వ్యవస్థ ఒక్కసారిగా ఎదురు తిరిగే సరికి ఆ పార్టీ పూర్తిగా డోలాయమానంలో పడింది.
దేశంలోనే మొట్టమొదటి సారిగా మత విద్వేషాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలు గొంతు విప్పాయి. బిజెపి నమ్ముకున్న హిజాబ్ ఇప్పుడు ఆ పార్టీని కొంప ముంచే దుస్థితికి నెట్టింది. హిజాబ్ పై జరుగుతున్న అలజడితో అధికార బిజెపికి కార్పొరేట్ సంస్థలు అల్టిమేటం జారీ చేశాయి. ఇలా అయితే మేము తెలంగాణకు తరలిపోతామంటూ చేస్తున్న హెచ్చరికలు ఆపార్టీకి ఊపిరి సలపనీయడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో ఎటూ పట్టులేదు. పట్టు ఉందనుకుంటున్న కార్పొరేట్ వ్యవస్థలో మత విద్వేషాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చే సరికి కమలనాధులకు ఎంత మాత్రం మింగుడుపడడం లేదు. విచిత్రంగా మీడియా చెబుతున్నట్లు క్షేత్ర స్థాయిలో ఎక్కడా కుల ప్రభావం కనిపించడం లేదు. జాతీయ స్థాయిలో ఇంగ్లీష్ మీడియా క్షేత్ర స్థాయిలో పరిశీలించి అందుస్తున్న కథనాలు అచ్చెరువుపోయేలా చేస్తున్నాయి.
కులాల ప్రాతి పదికన అన్న వార్తలు మొత్తం వారివారి ఆఫీసులలో కూర్చుని వండి వార్చేవే అని స్పష్టంగా తెలిసిపోతుంది. కన్నడనాట బలమైన కులానికి చెందిన ముఖ్యమంత్రి యడ్యూరప్పను మార్చడం పట్ల ఆ పార్టీ ఎదురీత ఈదుతుందన్న దాంట్లో ఆవగింజంతైనా వాస్తవం లేదు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టాం.. దశాబ్దా కాలంగా కేంద్రంలో స్కామ్‌లు, స్కీమ్ లు ఏమి లేవు, మోడీ సర్కార్‌కు అవినీతి మలినం అంటుకోలేదంటూ కార్పొరేట్ మీడియా తో ప్రచారం చేయించుకున్న బిజెపికి అదే కార్పొరేట్ వ్యవస్థ ద్వారా జాతీయ మీడియాలో కర్ణాటకలో కాంట్రాక్టర్ల బిల్లుకు 40% కమీషన్ అంటూ నేరుగా కాంట్రాక్టర్లు చెప్పిన విషయానికి మాత్రామే తాజా ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారన్నది ఎందరికీ తెలుసు. ఆ అవినీతి మకిలి అంటుకున్నందుకే యడ్యూరప్పను తొలగించారని ఇప్పుడు అక్కడి ప్రజలకు సుస్పష్టంగా తెలిసిపోయింది. దీనితో ఏమి చేయాలో దిక్కు తోచని మోడీ ద్వయం ఉచితాల పల్లవి అందుకుంది. ఉచితాలతో దేశ శ్రేయస్సుకు భంగం అంటూ తెలంగాణలో ఉచిత విద్యుత్‌కు అడుగడుగునా మోకాలొ డ్డుతున్న మోడీ, షా ద్వయమే ఇప్పుడు ఉచితాల రాగం అందుకునే సరికి అక్కడి ప్రజలు విస్తుపోతున్నారు. ఈ మొత్తం కర్ణాటక ఎన్నికల ఎపిసోడ్ లో అధికారంలోకి వచ్చి తీరుతుంది అనుకున్న బిజెపికి అక్కడి ఓటర్లు చుక్కలు చూపిస్తుండగా నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతూ.. గల్లీలో లేక ఢిల్లీలో లేని పార్టీని ఇప్పుడు అక్కడి ప్రజలు నెత్తికెత్తికుంటున్నారు. ముక్కు కోసినా సరే మొదటి మొగుడే నయం అన్న పద్ధతిలో కర్ణాటకలో విపక్ష పార్టీకి అక్కడి ప్రజలు జై కొడుతున్నారు. 40% కమీషన్‌లు అంటూ బాంబు పేల్చింది అక్కడి విపక్షం ఎంతమాత్రం కాదండోయ్. అక్కడి కాంట్రాక్టర్లు జాతీయ మీడియాకు ఎక్కితే అది నేరుగా ప్రజాక్షేత్రానికి చేరింది.
అంతే కాదండోయ్ అక్కడ కట్టలకు కట్టలు నోట్ల కట్టలు దొరికినా అది షోషల్ మీడియా ఓటర్లకు చేర వేసింది తప్ప బిజెపిని దించి అధికారంలోకి రావాలనుకున్న పార్టీ శ్రమ ఎంతమాత్రం కాదండోయ్. ప్రజాస్వామ్యంలో ఓటరు నిర్ణయం ఎంతటి గొప్పది అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలు రుజువు చేయబోతున్నాయి. అటు ఇటుగా మెజార్టీ ఇవ్వకండి.. అదే జరిగితే గుజరాత్ నుండి నోట్ల కట్టలు దిగితే మళ్ళీ అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందంటూ విపక్ష నేత చెబుతున్న మాటలకు సానుకూల స్పందనే కనపడుతున్నది. పైగా అధికార బిజెపి నమ్ముకున్న కార్పొరేట్ మీడియాకు క్షేత్ర స్థాయిలో ఆదరణ కోల్పోవడంతో ఆ పార్టీ నోటును నమ్ముకోగా విపక్ష పార్టీ ఓటును నమ్ముకుంది. ప్యాకేజీలకు అమ్ముడుబోయే షోకేజీ బొమ్మ లం కాదంటూ స్పష్టమైన తీర్పు నిచ్చేందుకు ప్రజాక్షేత్రం సన్నద్ధమవుతున్నది.
కమలనాథుల ఎదురీత
- Advertisement -
- Advertisement -
- Advertisement -