Tuesday, November 19, 2024

కర్ణాటకలో కాంగ్రెస్‌కు ప్రతిరూపంగా బిజెపి!

- Advertisement -
- Advertisement -

గత వారం రోజులలో దక్షిణాదిన నలుగురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు నాలుగు రాష్ట్రాల నుండి బిజెపిలో చేరారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, కేరళలో మాజీ కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు ఎకె అనిల్ ఆంటో ని, తమిళనాడులో సి రాజగోపాలాచారి మునిమనవడు సిఆర్ కేశవన్, తెలంగాణలో మాజీ ఎంఎల్‌ఎ యేలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. వీరందరూ ఒంటరిగా బిజెపిలో చేరారు. వీరు పార్టీ మారడం ద్వారా వ్యక్తిగతంగా ఏమైనా ప్రయోజనం పొందవచ్చు గాని వారి వల్లన కాంగ్రెస్‌కు నష్టం గాని, బిజెపికి చెప్పుకోదగిన ప్రయోజనంగాని ఉండదు. కానీ, కాంగ్రెస్ వారంతా బిజెపిలోకి వస్తున్నారనే వాతావరణం కర్ణాటకలో సృష్టించి ప్రయోజనం పొందాలనేది బిజెపి వ్యూహంగా కనిపిస్తున్నది.

మే 10న జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బిజెపి, – కాంగ్రెస్‌లకు ప్రతిష్ఠాకరంగా మారాయి. ఒక విధంగా 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ ఫలితాలు కీలకం కానున్నాయి. దక్షిణాదిన తమకున్న ఏకైక అధికార పీఠాన్ని కాపాడుకోవడం తమ బలం విస్తరించేందుకు బిజెపికి చాలా అవసరం. అదే విధంగా తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో కాంగ్రెస్ కు సహితం ఇక్కడ గెలుపొందడం అత్యవసరం. ప్రాథమిక ఎన్నికల సర్వేలు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా వచ్చే అవకాశాలను సూచిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్‌లో కన్నా బిజెపిలో కలకలం రేపింది. సీనియర్ నేతలే పలువురు పార్టీకి దూరం అవుతున్నారు. ఏకంగా నలుగురు ఎంఎల్‌సి పార్టీకి రాజీనామా చేయడంతో శాసనమండలిలో బిజెపి మెజారిటీ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అందుకనే కాంగ్రెస్ లక్ష్యంగా బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.

2014లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కాంగ్రెస్‌కు భిన్నమైన రాజకీయాలను అనుసరించడంకన్నా, కాంగ్రెస్‌నే అనేక విషయాలలో అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకనే ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. కాంగ్రెస్‌లో పదవులు పొందలేకపోయిన వారినో, ప్రజలతో సంబంధంలేని వారినో, సొంతంగా కూడా గెలుపొందలేని వారి నో పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్‌ను బలహీనం చేస్తున్నట్లు సంబరపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ను తమ పరిపాలన సామర్థ్యంతో, ప్రజారంజక పాలనతో ఓడించే ప్రయత్నం చేయవలసిందిపోయి, పొరుగు రాష్ట్రాలలో రాజకీయ ఉనికిలేని కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకొని, కర్ణాటకలో కాంగ్రెస్ నేతల మనోస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. గత వారం రోజులలో దక్షిణాదిన నలుగురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు నాలుగు రాష్ట్రాల నుండి బిజెపిలో చేరారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, కేరళలో మాజీ కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు ఎకె అనిల్ ఆంటో ని, తమిళనాడులో సి రాజగోపాలాచారి మునిమనవడు సిఆర్ కేశవన్, తెలంగాణలో మాజీ ఎంఎల్‌ఎ యేలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. వీరందరూ ఒంటరిగా బిజెపిలో చేరారు. వీరు పార్టీ మారడం ద్వారా వ్యక్తిగతంగా ఏమైనా ప్రయోజనం పొందవచ్చు గాని వారి వల్లన కాంగ్రెస్‌కు నష్టం గాని, బిజెపికి చెప్పుకోదగిన ప్రయోజనంగాని ఉండదు. కానీ, కాంగ్రెస్ వారంతా బిజెపిలోకి వస్తున్నారనే వాతావరణం కర్ణాటకలో సృష్టించి ప్రయోజనం పొందాలనేది బిజెపి వ్యూహంగా కనిపిస్తున్నది. రాజకీయంగా ఎన్నికలను ఎదుర్కోలేమనుకున్నప్పుడు ఇటువంటి అడ్డదారులు వెతుక్కోవాల్సి వస్తుంది.

అవినీతి, శాంతి భద్రతలు, పరిపాలన వంటి అంశాలలో కాంగ్రెస్ కన్నా భిన్నమైన పరిపాలన ఇచ్చామని చెప్పుకోలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయింపులకు ద్వారాలు తెరవవలసి వస్తుంది. కర్ణాటకలో సహితం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి డికె శివకుమార్ వంటి నేతలను ఆకట్టుకొనే ప్రయత్నాలు గతంలో ఫలించలేదు. బిజెపి గతంలో కాంగ్రెస్‌కు భిన్నమైన రాజకీయ సంస్కృతిని, విధానాలను అందిస్తుందని ఆ పార్టీ నాయకులు గర్వంగా చెప్పుకొంటుండేవారు. కానీ, మొదటిగా ఇటీవల కాలంలోనే బిజెపిలో నాయకత్వం కొరతను తీర్చడం కోసం కాంగ్రెస్ నాయకులను ఆకట్టుకోవడం ప్రారంభించారు. అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ కేవలం ఆ రాష్ట్రంలోనే కాకుండా ఇప్పుడు మొత్తం ఈశాన్య ప్రాంతంలో బిజెపికి బలమైన వ్యూహకర్తగా ఎదిగారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్‌లో జితిన్ ప్రసాద వంటి కాంగ్రెస్ నేతలకు సహితం కీలక ప్రాధాన్యత ఇచ్చా రు. అదే పద్ధతిని దక్షిణాదిలో సహితం అనుసరిస్తున్న బిజెపికి చెప్పుకోదగిన ప్రయోజనం కలగడం లేదు. పలువురు కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకొంటున్నా పార్టీకి క్షేత్ర స్థాయిలో వారు ఎటువంటి ప్రయోజనం కలిగించలేకపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర మంత్రిగా పని చేసిన డి పురందేశ్వరి, సుదీర్ఘకాలం రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రిగా పని చేసిన కన్నా లక్ష్మీనారాయణలను చేర్చుకొని, వారిద్దరికీ పార్టీలో కీలక పదవులు ఇచ్చారు. అయితే రాష్ట్రంలో నోటాకు వచ్చిన ఓట్లు కూడా పొందలేకపోయారు. బిజెపి ప్రారంభించిన తర్వాత ఎపిలో అంత అధ్వాన్నంగా బిజెపికి ఓట్లు రాలేదు. తెలంగాణలో సహితం కొందరు కాంగ్రెస్ నేతలను దగ్గరకు తీసినా పార్టీ పుంజుకోలేకపోతుంది. ఈ విధంగా కాంగ్రెస్ నాయకులను చేర్చుకోవడం పార్టీ ఎదుర్కొంటున్న నాయకత్వం సంక్షోభాన్ని సహితం వెల్లడిస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ ఆంటోనీ వంటి నాయకులను చేర్చుకోవడం వల్లన బిజెపికి ఓట్లపరంగా ప్రయోజనం లేకపోయినప్పటికీ జనానికి తెలిసిన నాయకులతో ప్రజల వద్దకు వెళ్లడం సులభం అవుతుందని బిజెపి నాయకులు ముఖ్యంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నాయకులలో చాలా మంది మీడియాకు పరిమితమైన వారే గాని సొంతంగా ఒక నియోజకవర్గం అంటూ ఉన్నవారు లేరు.

ఇప్పటి వరకు కాంగ్రెస్ అంటే నాయకుల మధ్య కుమ్ములాటలకు ప్రఖ్యాతి పొందుతూ ఉండెడిది. ఇప్పుడు బిజెపి సహితం కర్ణాటకలో అటువంటి రుగ్మతలకు కేంద్రంగా మారుతున్నట్లు అభ్యర్థుల ఎంపిక వ్యవహారం వెల్లడి చేస్తుంది. కాంగ్రెస్ నాయకులను దిగుమతి చేసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీలోని అవలక్షణాలను సహితం బిజెపి సొంతం చేసుకొంటుందనే ఆందోళనలు ఆ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటకలో కావచ్చు, మరే రాష్ట్రంలో అయినా ప్రధాని మోడీకి గల ప్రజాకర్షణపైననే బిజెపి అభ్యర్థులు ఆధారపడుతున్నారు. కానీ తమ ప్రభుత్వ పాలనను చూపి ప్రజల మన్ననలు పొందగలమన్న ధీమా వారిలో కనిపించడం లేదు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న సిద్దరామయ్య, డికె శివకుమార్‌ల మధ్య గల వర్గ విభేదాలపై ఆశలు పెట్టుకొంటున్న బిజెపికి ఆ పార్టీకి మించి తమలో కుమ్ములాటలు శృతిమించడం పట్ల నిస్సహాయంగా మిగిలే పరిస్థితులు నెలకొన్నాయి.

వాస్తవానికి కర్ణాటకలో పార్టీపరంగా కాంగ్రెస్ పరిస్థితి బిజెపికన్నా మెరుగుగా లేదు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర జరిపినా, రాష్ట్రానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉంటున్నా రాష్ట్రంలో పార్టీ ఎటువంటి ప్రయోజనం పొందలేకపోతున్నది. కొన్ని సర్వేలు బిజెపికన్నా కాంగ్రెస్ కొంత మెరుగుగా ఉన్నట్లు చూపుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరడంలో ఆ పార్టీ బాగా వెనుకబడి ఉంది. ఇప్పటికే ప్రధాని మోడీ, బిజెపి కీలక నాయకులు రాష్ట్రం నలువైపులా చుట్టివచ్చారు. ప్రజలకు పార్టీ సందేశం తీసుకెళ్లడంలో విజయం సాధించారు. కానీ అటువంటి పరిస్థితి కాంగ్రెస్ లో కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రచార అస్త్రంగా తయారు చేసుకున్న గ్యారంటీ కార్డులను అనేక నియోజక వర్గాలలో ఇంకా ప్రజలకు చేరలేదు. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ ప్రచారం ఇంకా ప్రారంభం కాలేదు. అయితే, కాంగ్రెస్ అనగానే అవినీతి పాలనకు మారుపేరుగా ఇంతకాలం ప్రచారం చేసుకున్నట్లు ఇప్పుడు బిజెపి చేసుకోలేక పోతున్నది. గతంలో సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ‘10 శాతం’ అవినీతి ప్రభుత్వంగా స్వయం గా ప్రధాని మోడీ విమర్శించారు. ఇప్పుడు సొంత పార్టీ వారే ‘40 శాతం’ ప్రభుత్వం అని అంటుంటే బలంగా తిప్పికొట్టడంలో బిజెపి విజయం సాధించలేదని చెప్పవచ్చు.

ముఖ్యంగా రైతుల విశ్వాసాన్ని పొందడంలో బిజెపి ప్రభుత్వం విజయం సాధించలేదనే అభిప్రాయం నెలకొంది. చెరకు, కొబ్బరి కనీస మద్దతు ధర ప్రధాన అంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం, బీమా చెల్లింపుల విషయంలో సహితం వారిలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గ్రామీణ ప్రాంతాలలో అధ్వానంగా ఉన్న రహదారులు, పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్యలు వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయని పీపుల్స్ సర్వే వెల్లడించింది. ఎన్నికల ముందు హడావుడిగా రిజర్వేషన్లలో తీసుకొచ్చినా మార్పులు ఏ మేరకు ప్రజలకు చేరతాయో చూడవలసి ఉంది.

2019లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల అమలును ప్రారంభించినా, వాటిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలనే విశ్వసించి ఓటు వేయడం గమనార్హం. పైగా, ఇప్పుడు రిజర్వేషన్ల ప్రాతిపదికపై సుప్రీంకోర్టులో కీలకమైన వాదనలు జరుగుతున్నాయి. రిజర్వేషన్లకు మత ప్రాతిపదిక, సామాజిక హోదా ప్రాతిపదిక లేదా ఆర్ధిక ప్రాతిపదికల్లో నెలకొన్న గందరగోళాన్ని పరిష్కరించే దిశలో సుప్రీంకోర్టు అడుగువేసి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిర్దుష్టమైన తీర్పు ఇస్తే జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల అంశం మరోమారు రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఏదేమైనా సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో కొనసాగి, ఇప్పుడు రాజకీయ భవిష్యత్ కనిపించకపోవడంతో బిజెపిలో చేరగానే వారు పరివర్తన చెందుతారా? లేదా అటువంటి విధానాలు బిజెపి స్వరూపాన్నే మార్చివేస్తున్నాయా? అన్నది ఇప్పుడు అసంఖ్యాక బిజెపి శ్రేణులు ఎదుర్కొంటున్న ప్రశ్న.

* చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News