Wednesday, January 22, 2025

నేడే కన్నడనాట పోలింగ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారంనాడు 224 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం పోలింగ్ స్టేషన్లలో తగిన ఏ ర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. రాష్ట్రంలో అధికారం కోసం ప్రధానంగా మూడు పార్టీలు అధికార బిజెపి సహా కాంగ్రెస్, జెడి(ఎస్) తలపడుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో కూడా ముక్కోణపు పోటీ జరగనుంది. సోమవారం వరకు మూ డు పార్టీల నాయకులు హోరాహోరీ ప్రచారం చేశారు. గెలుపుకోసం తమవంతుగా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. 224 స్థానాలకు బరిలో 2,615 మంది ఉన్నారు. వీరిలో పురుష అభ్యర్థులు 2,430మంది కాగా, మహిళలు 184 మంది.

కర్నాటకలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.31కోట్లు. వీరిలో పురుషులు 2.67కోట్లు మిగతా 2.64 కోట్ల మంది మహిళా ఓటర్లు. ఇతరులు 4,927 మంది. రాష్ట్ర వ్యాప్తంగా 58,545 పోలింగ్ స్టేషన్లు ఏర్పా టుచేశారు. యువ ఓటర్ల సంఖ్య కూడా భారీగానే 11.71లక్షల మంది ఉన్నారు. 5.71లక్షల మంది ది వ్యాంగులు ఉన్నారు. 80 ఏళ్లపైబడిన ఓటర్లు 12లక్షల మంది. వీరి కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మంగళవారంనాడు సాయంత్రం వరకు ఇవిఎంలు, వివిప్యాట్‌లు, తదితర ఎన్నికల సామాగ్రిని పో లింగ్ కేంద్రాలకు తరలించారు. పోలీసు అధికారులు సైతం భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత నిఘా పెంచారు. పోలింగ్ కేంద్రాల్లో సిసిటివి, వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

ఇదిలావుండగా మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుని 38 ఏళ్ల సంప్రదాయానికి తెరదించాలని బిజెపి ఉవ్విళ్లూరుతుండగా, ఈసారి ఎలాగైనా తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. తద్వారా రానున్న లోక్‌సభ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ నాయకత్వంలోని జెడి(ఎస్) కూడా ప్రజల్లో మంచిపట్టు సాధించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సారి కాంగ్రెస్, బిజెపిలో ఎవరికీ అధికారానికి కావాల్సిన మెజారిటీ (113) అందుకోకపోతే ‘కింగ్ మేకర్’ అయ్యే అవకాశం కోసం జెడిఎస్ ఎదురుచూస్తోంది. అవకాశాలు కలిసివస్తే కింగ్ పాత్ర పోషించే పరిస్థితిని కొట్టిపారేయలేమని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. 2018 తరహా పరిస్థితి తిరిగి రాష్ట్రంలో తలెత్తకుండా సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను అన్ని పార్టీల నాయకులు తమ ప్రచారంలో ప్రముఖంగా కోరారు. 2018 ఎన్నికల్లో కర్నాటకలో 72.36 శాతం ఓటింగ్ నమోదైంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, విపక్ష కాంగ్రెస్ నేత, మాజీ సిఎం సిద్ధరామయ్య, డికె శివకుమార్, మాజీ సిఎం కుమారస్వామి బరిలో నిలిచిన ప్రముఖుల్లో ఉన్నారు. 2018 ఎన్నికలో 104 స్థానాలు గెలిచి బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 80, జెడి(ఎస్) 37, బిఎస్‌పి, కెపిజెపి తలా ఒక సీటు గెలుచుకున్నాయి.

దేవాలయాలకు ప్రముఖ నేతలు
ఎన్నికల నేపథ్యంలో దైవానుగ్రహం కోసం వివిధ పార్టీల నేతలు ఆలయాలకు వరుస కట్టారు. సిఎం బొమ్మై హుబ్బళ్లిలోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి చాలీసా పఠించారు. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డికె శివకుమార్ మంగళవారం మైసూరులోని చాముండేశ్వరి ఆలయంతో పాటు ఆంజనేయుడి ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చేలా దీవించాలని ఆమ్మవారిని వేడుకున్నట్లు నేతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News