Monday, January 20, 2025

“పేసిఎం” పోస్టర్ ప్రచారంపై హోరెత్తిన కర్ణాటక అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

Karnataka assembly uproar over “PayCM” poster campaign

న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్
ఇదంతా తప్పుడు ప్రచారమని బీజేపీ వాదన

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అవినీతికి పాల్పడుతున్నారంటూ రాజధాని బెంగళూరులో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల యాప్ “పేటీఎం” తరహాలో “పేసీఎం” అని పేర్కొంటూ క్యూర్ కోడ్‌లో ఏకంగా బసవరాజ్ బొమ్మై ఉన్న ఈ పోస్టర్లు ఇప్పుడు సామాజిక మాథ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో బొమ్మై అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు వెలుగు చూశాయి. ప్రభుత్వం 40 శాతం కమీషన్ తీసుకుంటోందన్న ఆరోపణల తరుణంలో తాజా పోస్టర్లలో “40 శాతం తీసుకుంటాం” అని కూడా పేర్కొనడం గమనార్హం. గురువారం కర్ణాటక అసెంబ్లీలో దీనిపై హోరెత్తింది. రాజకీయ ప్రయోజనాల కోసం యధేశ్చగా, అనవసరంగా ముఖ్యమంత్రి బొమ్మైపై కాంగ్రెస్ బూటకపు ప్రచారం సాగిస్తోందని బీజేపీ ఆరోపించింది. దీన్ని కాంగ్రెస్ గట్టిగా ఎదుర్కొంది. ఇందులో ఏమైనా అవినీతి ఉంటే వెంటనే చర్య తీసుకోవాలని కాంగ్రెస్ గట్టిగా వాదించింది. దర్యాప్తు సాగుతోందని, పోస్టర్లకు సంబంధించి పోలీసులు చర్య తీసుకుంటున్నారని రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జెసి మధుస్వామి వెల్లడించారు. జీరో అవర్‌లో దీనిపై బిజెపి ఎమ్‌ఎల్‌ఎ రాజీవ్ ప్రస్తావిస్తూ బుధవారం నాడు బెంగళూరు లోని అనేక ప్రాంతాల్లో “పేసిఎం” పోస్టర్లు వెలిశాయని, దీనివెనుక రాజకీయ పార్టీ హస్తం ఉందని ఆరోపించారు.

ముఖ్యమంత్రి ఫోటోతో పేసిఎం పోస్టర్లు ప్రదర్శించడానికి వారికి ఏం ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఏదైనా సాక్షాలు ఉంటే సిఎం ఫోటో ప్రదర్శించడానికి బదులు ఫిర్యాదు దాఖలు చేయవచ్చని సూచించారు. రాజీవ్ మొదట్లో దీనివెనుక ఎవరున్నారన్నది ప్రస్తావించలేదు. అయితే స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరీ ఎవరు దీనికి పాల్పడ్డారని ప్రశ్నించగా అనేక మంది బీజేపీ ఎమ్‌ఎల్‌ఎలు కాంగ్రెస్ పేరు ప్రస్తావించారు. కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ క్రిష్ణ బైరె గౌడ జోక్యం చేసుకుంటూ తానిచ్చిన నోటీసుకు రాజీవ్ మాట్లాడకుండా రాజకీయ ఉపన్యాసం ఇస్తున్నారని తాము చట్టాన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని ధ్వజమెత్తారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాంటి రుజువులు లేకుండా 10 శాతం ప్రభుత్వంగా ప్రధాని మోడీ ప్రచారం చేయడాన్ని గుర్తు చేశారు.

చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే చర్య తీసుకోవచ్చని సవాలు విసిరారు. ఎనిమిది మందికి వ్యతిరేకంగా కేసు దాఖలైందని, వారు అరెస్టయ్యారని, దీనికి తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని వ్యాఖ్యానించారు. అనేక మంది బీజేపీ ఎమ్‌ఎల్‌ఎలు నిల్చుని దీనిపై నిరసన తెలిపారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ మధుస్వామి ప్రభుత్వం చట్టప్రకారం చర్య తీసుకుంటుందని సభలో సర్దిచెప్పారు. మనం ప్రజాజీవితంలో ఉండి ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటున్నామని, ఇప్పుడు మనం ఎక్కడుంటున్నామో మన ఆత్మసాక్షిని మనం ప్రశ్నించుకోవాలని, ఎవరైతే గౌరవం ఇవ్వడానికి భయపడతారో వారు రాజకీయాల్లో కొనసాగలేరని స్పీకర్ వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News