Friday, November 15, 2024

రంగు రంగుల విషం!

- Advertisement -
- Advertisement -

యువత దైనందిన ఆహారంలో జంక్‌ఫుడ్ ఒక భాగమైపోయింది. ఇంట్లో చేసే సాంప్రదాయకమైన వంటలను చీదరించుకుంటూ, ఫుట్‌పాత్‌లపై విక్రయించే ఆహార పదార్ధాలను లొట్టలు వేసుకుంటూ తింటున్న కుర్రకారు… తమకు తెలియకుండానే రోగాలు, రొష్టులకు స్వాగతం పలుకుతున్నారు. నోరూరించే జంక్ ఫుడ్ తయారీలో ఇష్టారీతిన కృత్రిమ, హానికారక రసాయనాలు వాడుతున్నట్లు గతంలో ఎన్నో సందర్భాల్లో తేటతెల్లమైనా, ఆహారంపై తప్ప ఆరోగ్యంపై శ్రద్ధ లేని యువతరం వాటివైపే మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో కృత్రిమ ఫుడ్ కలర్లతో తయారు చేసే గోబీ మంచూరియా, పీచు మిఠాయిలపై నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినది.

Karnataka bans use of harmful dyes in Gobi Manchurian

ఫుడ్ సెంటర్లలో వండివార్చే మంచూరియా, పీచు మిఠాయిలలో రోడమైన్-బి అనే హానికారక రసాయనాన్ని వాడటం సర్వసాధారణమైపోయింది. ఆహార పదార్ధాలు చూడగానే ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ రసాయనాన్ని వాడుతుంటారు. తెల్లటి పీచు మిఠాయికి రోడమైన్-బి తగలగానే ఎర్రగా, నోరూరించే రంగును సంతరించుకుంటుంది. ఇండస్ట్రియల్ డైగా వ్యవహరించే ఈ రసాయనాన్ని దుస్తులకు రంగులు అద్దడంలోనూ, పేపర్ ప్రింటింగ్‌లోనూ విరివిగా వినియోగిస్తారు. దీన్ని ఫుడ్ కలరింగ్‌గా వాడటం వల్ల దీర్ఘకాలంలో మూత్రపిండాలు, కాలేయం పని తీరు మందగించి, కాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. కర్ణాటకలో 171 నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా, 107 రకాల ఆహార పదార్ధాలల్లో రోడమైన్-బి, టార్ట్రాజన్ అనే రసాయనాలు వాడుతున్నట్లు వెల్లడైంది. ఒకవైపు హానికారక రసాయనాల వాడకం, మరో వైపు ఆహార పదార్ధాల కల్తీ మనిషి ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయి.

లాభార్జనే ధ్యేయంగా నడిచే నాసిరకం హోటళ్లు, ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు వినియోగదారుల ఆరోగ్యం గురించి పట్టించుకుంటారనుకోవడం భ్రమ. పైగా పేవ్‌మెంట్లపై ఆహార పదార్ధాలు విక్రయించేవారిలో నిరక్షరాస్యులే ఎక్కువ. మార్కెట్లో చౌకగా దొరికే ముడిసరుకులతో మంచూరియా, నూడిల్స్ వంటి ఆహార పదార్ధాలు విక్రయించేవారికి ఆ రోజుకు ఎంత లాభం వచ్చిందనే తప్ప, పరిశుభ్రమైన, నాణ్యమైన పదార్ధాలను విక్రయించాలన్న ధ్యాస ఉండదు. అలాంటిచోట్ల తినేవారికి సైతం ఆరోగ్యంపై స్పృహ లేకపోవడమే బాధాకరమైన విషయం. రెస్టారెంట్లలోనూ, చౌకగా దొరికే ప్రాసెస్డ్ ఆహారంలోనూ రుచి కోసం ఇష్టారీతిన సోడియం వాడుతుంటారు. శరీరానికి సోడియం అవసరమే అయినా మితిమీరి వాడితే దాని వల్ల కలిగే దుష్ప్రయోజనాలే ఎక్కువ.

ఆహారంలో సోడియం మోతాదు పెరిగితే రక్తనాళాలు కుచించుకుపోయి, గుండెపై భారం పడుతుంది. ఫలితంగా రక్తపోటు పెరిగి, గుండెపోటు, మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం, కిడ్నీ జబ్బులకు దారి తీస్తుందని నిపుణులు నెత్తీనోరూ మొత్తుకుంటున్నారు. రసాయనాల వాడకం సంగతి ఇలా ఉంటే, సామాన్యుడు తినే ఆహారంలో జరుగుతున్న కల్తీ మరో పార్శ్వం. కాదేదీ కల్తీకనర్హం అన్నట్లు ఉదయం లేవగానే తాగే టీ, కాఫీ మొదలు భోజనంలో కీలక పాత్ర వహించే పసుపు, కారం, నూనె, నెయ్యి, అల్లం- వెల్లుల్లి పేస్ట్ వంటివన్నీ కల్తీ అవుతున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ శివార్లలో తయారు చేస్తున్న అల్లం- వెల్లుల్లి నకిలీ పేస్ట్‌ని అధికారులు టన్నుల కొద్దీ స్వాధీనం చేసుకోవడం కల్తీదారులు పేట్రేగిపోతున్నారనడానికి నిదర్శనం. ఆహారంలో కల్తీ, కృత్రిమ రంగుల వాడకం వృషణాలు, అండాశయాలు, ప్లీహం వంటి అవయవాల పనితీరును దెబ్బ తీస్తోందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (ఐఐటిఆర్) జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.

ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో వినియోగించిన కృత్రిమ రంగు, దాని పరిమాణాన్ని పాకెట్లపై ఖచ్చితంగా పేర్కొనాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ నిర్దేశిస్తోంది. కానీ ఆచరణలో ఈ నిబంధనలకు తిలోదకాలిస్తున్న దాఖలాలే ఎక్కువ. హోటళ్లు, రోడ్డు పక్కన బండ్లపై దాడులు జరిపి నాణ్యతా ప్రమాణాలను పరీక్షించవలసిన అధికారుల ఉదాసీన వైఖరి కల్తీదారులకు వరంగా మారుతోంది. కృత్రిమ రంగులు వాడే, కల్తీ ఆహారం తయారు చేసే వారి భరతం పట్టేందుకు పటుతరమైన చట్టాల రూపకల్పన జరగాలి. భారత శిక్షా స్మృతి సెక్షన్ 272 ప్రకారం కల్తీ నేరానికి ఆరు నెలల జైలు, వెయ్యి రూపాయల శిక్ష విధిస్తుండగా, దీనిని యావజ్జీవ కారాగారం, పది లక్షల జరిమానాకు పెంచాలంటూ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, కొంతవరకైనా అక్రమార్కులకు ముకుతాడు పడే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News