ప్రేమించిన అమ్మాయితో కొడుకు లేచిపోయాడు. అందుకు ఫలితం అతని తల్లి అనుభవించింది. ఆమెను నగ్నంగా చేసి, హింసించి, తమ కక్ష తీర్చుకున్నారు యువతి తాలూకు బంధువులు. మానవత్వానికే కళంకం తెచ్చే ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.
బెలగావి తాలూకాలోని హోసా వంట్మూరి అనే ఊళ్లో ఓ కుర్రాడు అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడింది. అయితే ఆమెకు బంధువులు ఆదివారం రాత్రి పెళ్లి తలపెట్టారు. దాంతో ఇద్దరూ ఎవరికీ చెప్పాపెట్టకుండా లేచిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన యువతి బంధువులు యువకుడి ఇంటిపై దాడి చేసి, ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా, యువకుడి తల్లిని తీవ్రంగా హింసించారు. ఆమె బట్టలు విప్పేసి, కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ సంఘటన కర్ణాటకలో సంచలనం సృష్టించింది. పోలీసులు ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్టు చేశారు. పోలీస్ కమిషనర్ సిద్దరామప్ప స్వయంగా గ్రామాన్ని సందర్శించారు.