Wednesday, January 22, 2025

బిజెపి టిక్కెట్ కుంభకోణం: పోలీసుల ఇంటరాగేషన్‌లో స్పృహతప్పిన చైత్ర

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిజెపి టిక్కెట్ ఇప్పిస్తానని వాగ్దానం చేసి ఒక వ్యాపారవేత్తను రూ. 5 కోట్లు మోసం చేసిన హిందూత్వ కార్యకర్త చైత్ర కుందపురను శుక్రవారం సిటీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సిసిబి) కార్యాలయంలో ప్రశ్నిస్తుండగా స్పృహతప్పి పడిపోయింది. నిందితురాలిని వెంటనే చికిత్స కోసం నగరంలోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

శుక్రవారం ఉదయం మహిళల పునరావాస కేంద్రం నుంచి చైత్రను సిసిబి ఆఫీసుకు పోలీసులు తీసుకువచ్చారు. మొదట జూనియర్ అధికారులు ఆమెను ప్రశ్నించారు. అనంతరం ఎసిపి రీనా సువర్ణ ప్రశ్నించడం ప్రారంభించగానే చైత్ర కుప్పకూలిపోయారు.ఆమె నోటి నుంచి నురగ కూడా వచ్చినట్లు వర్గాలు తెలిపాయి.

ఆమెను వరుసగా మూడవరోజు ప్రశ్నిస్తుండగా ఈ ఘటన జరిగింది. చైత్ర మూర్చ వ్యాధి(ఎపిలెప్సీ)తో బాధపడుతున్నట్లు ఆమె కుటుంబ వర్గాలు తెలిపాయి. ఇదిలాఉండగా సిసిబి ఆఫీసులో చైత్ర ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు కూడా వర్గాలు తెలిపాయి. అయితే సిసిబి నుంచి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడవలసి ఉంది.

 

కాగా..ఇదే కేసులో మరో నిందితుడు కర్నాటకలోని విజయనగర్ జిల్లా హేవినహదగలిలోని హీరేహదగలి మఠానికి చెందిన అభినయ హలశ్రీ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చైత్ర కుందపుర అరెస్టు అయినప్పటి నుంచి పరారీలో ఉన్న హలశ్రీ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

బెంగళూరులోని 57 సిసిహెచ్ కోర్టులో హలశ్రీ దాఖలు చేసిన పిటిషన్ శనివారం విచారణకు రానున్నది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన పలువురు ప్రముఖ నాయకులతో హలశ్రీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి.

టిక్కెట్ల అమ్మకం కుంభకోణంలో బడా నాయకులకు సంబంధం ఉందంటూ చైత్ర కుందరపుర చేసిన ప్రకటనతో ఈ కేసు సంచలనంగా మారింది. అయితే చైత్ర కేసుతో తమకేం సంబంధం లేదన్నట్లు బిజెపి కర్నాటక శాఖ వ్యవహరిస్తోంది. చైత్ర అరెస్టుకు, బిజెపికి మధ్య ఎటువంటి సంబంధం లేదని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. ఈ కుంభకోణంతో ఎవరికి సంబంధం ఉన్నా, వారు మఠాధిపతులైనప్పటీ వారిని అరెస్టు చేసి శిక్షించాలని ఆయన డిమాండు చేశారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానిక బిజెపి నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నపటికీ అసెంబ్లీ ఎన్నికల్లో 72 కొత్త వ్యక్తులకు బిజెపి టిక్కెట్లు ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావడి, మాజీ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప లాంటి దిగజ్జాలకు టిక్కెట్లు దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News