Saturday, November 9, 2024

కర్ణాటక మంత్రి పదవులపై ఆశావహుల అలజడి

- Advertisement -
- Advertisement -

మైసూరు : కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై అధికార వర్గాల్లోనే జోరుగా ఊహాగానాలు చెలరేగుతుండడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం స్పష్టం చేశారు. మంత్రిపదవులను ఆశించే నేతలు బహిరంగంగానే తమ ఆకాంక్షలను వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య పునర్‌వ్యవస్థీకరణయినా, లేక మరేదైనా నిర్ణయించేది కాంగ్రెస్ కేంద్ర నాయకత్వమే తప్ప తాను కాదని స్పష్టం చేశారు. “ మంత్రి పదవిని ఆశించడం పొరపాటు కాదు. అయితే మంత్రివర్గాన్ని విస్తరించడం, లేదా మరేదైనా సరే పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుంది తప్ప మరెవరూ కాదని మంత్రివర్గ కసరత్తుపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

అసెంబ్లీ చీఫ్ విప్ అశోక్ పట్టన్ ఇటీవల కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని చెప్పడమే కాక, తాను కూడా మంత్రిపదవి అభ్యర్థినేనని తనకు తాను వివరణ ఇచ్చుకున్నారు. రామ్‌దుర్గ ఎంఎల్‌ఎ కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న అభిప్రాయం వెలిబుచ్చారు. రెండున్నర ఏళ్ల తరువాత కేబినెట్ విస్తరణ ఉంటుందని, అప్పుడు తనవంటి సీనియర్ నేతలకు అవకాశం కల్పించడమౌతుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు రణదీప్ సింగ్ సుర్జేవాలా, కెసి వేణుగోపాల్, తదితరులు తనకు హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. శాంతినగర్ ఎమ్‌ఎల్‌ఎ ఎన్‌ఎ హారిస్ కూడా “ రేపు అని కాదు, తాను తప్పనిసరిగా నిన్ననే మంత్రి కావలసిందని , దానికి తాను అర్హుడునని తన ఆశను వెలిబుచ్చారు.

బీజేపీ విమర్శలను తిప్పికొట్టిన ముఖ్యమంత్రి సిద్దా రామయ్య
కర్ణాటక రాష్ట్రం దివాలా తీసిందని, ఎటిఎం ప్రభుత్వమని బీజేపీ విమర్శలు గుప్పించడంపై ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గట్టిగా తిప్పికొట్టారు. కాషాయ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థికస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎలా ఉందో తాను అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేసిందో తెలుసుకోవాలన్నారు. ఆనాడు నిధులేమీ లేకున్నా వర్క్ ఆర్డర్లు జారీ చేసి టెండర్లను పిలిచారని, అధికారం నుంచి వైదొలిగే ముందు బిల్లులు పెండింగ్‌లో ఉంచారని, దాదాపు 30,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు.

మరి ఈ పరిస్థితికి కారకులెవరు ?అలాంటి పరిస్థితి అంతకు ముందు తమ ప్రభుత్వ హయాంలో ఉందా ? అని ప్రశ్నించారు. ప్రజలచే తిరస్కరించబడిన బీజేపీ రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకోసం నిధులు వెచ్చించేందుకు అధికార పార్టీ కాంగ్రెస్ నిధులు దుర్వినియోగం చేస్తోందన్న బిజేపీ విమర్శలను కూడా తిప్పికొట్టారు. అధికార పార్టీ ఎలాంటి నిధులు దుర్వినియోగం చేయడం కానీ, లేదా ఎలాంటి అక్రమాలకు పాల్పడడం కానీ చేయలేదని సమాధానమిచ్చారు.

ఆపరేషన్ లోటస్… బీజేపీ
ఆపరేషన్ లోటస్ బీజేపీ విధానమని, బీఎస్ యెడియూరప్ప ప్రభుత్వం సుస్థిరత కోసం అనేక మంది విపక్ష ఎమ్‌ఎల్‌ఎలను ఆకర్షించడానికి, ప్రలోభపెట్టడానికి ఆనాడు బీజేపీ ఆపరేషన్ లోటస్ విధానాన్ని అవలంబించిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News