బెంగళూరు: కరోనా తేలికపాటి లక్షణాలు కనిపించడంతో న్యూఢిల్లీ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నానని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం వెల్లడించారు. ఇంటివద్దనే తనకు తాను ఐసొలేషన్‌లో ఉన్నానని తెలియజేశారు. గత కొన్నిరోజులుగా తనకు అత్యంత సన్నిహితంగా మసలిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంతోపాటు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కూడా ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఢిల్లీలో శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం 7 గంటలకు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై బిజేపి జాతీయ నాయకత్వానికి వివరించేందుకు బొమ్మై సిద్ధమయ్యారు కూడా. 2023 అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలపై కూడా ఆయన చర్చించాలనుకున్నారు. కానీ కరోనా పాజిటివ్ కారణంగా ఆయన ఢిల్లీ ప్రయాణం రద్దయింది. బొమ్మై శుక్రవారం రోజంతా వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. స్టేట్ హైలెవెల్ క్లియరెన్స్ కమిటీ వంటి సమావేశాలు నిర్వహించారు. లాల్‌బాగ్ గ్లాస్‌హౌస్‌లో వార్షిక స్వాతంత్ర య దినోత్సవానికి సంబంధించి పుష్పప్రదర్శనను శుక్రవారం ప్రారంభించారు. బెంగళూరు చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ, అండ్ కామర్స్ (బిసిఐసి) వార్షిక సాధారణ సమావేశంలో కూడా బొమ్మై పాల్గొన్నారు.