మంత్రులలో అసంతృప్తిపై చర్చ
బెంగళూరు: మంత్రివర్గ విస్తరణ, మంత్రిత్వశాఖల కేటాయింపుపై కొందరు బిజెపి మంత్రులు, శాసనసభ్యులలో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై శనివారం మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పతో సమావేశమై చర్చలు జరిపారు. యడియూరప్ప నివాసంలో అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులలో నెలకొన్న అసంతృప్తి గురించే కాక రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని గురించి కూడా వీరు చర్చించినట్లు ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి. తమకు కేటాయించిన శాఖలపై పర్యాటక మంత్రి ఆనంద్ సింగ్, పురపాలక, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ నాగరాజ్ ఇప్పటికే బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. తమకు కీలక శాఖలు కావాలని వారు కోరుతున్నారు. కాగా..తమకు మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంపై బిజెపి ఎమ్మెల్యే ఎస్ఎ రామదాస్, ఎంఎల్సి పి యోగీశ్వర, తదితరులు అసంతృప్తిగా ఉన్నారు.