కర్నాటక సిఎం బొమ్మై స్పష్టీకరణ
బెంగళూరు/శృంగేరి: కర్నాటకలోని హుబ్బలిలో జరిగిన హింసాకాండకు సంబంధించి అమాయకులను అరెస్టు చేస్తున్నారన్న ఆరోపణలను కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తోసిపుచ్చారు. సాక్ష్యాల ఆధారంగానే అరెస్టులు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. శృంగేరి పట్టణంలోని హెలిపాడ్ వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హింసాకాండతో సంబంధమున్న వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తప్పవని, పోలీసు స్టేషన్‌పై దాడి చేయడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు. రాష్ట్రంలో రామ రాజ్యం బదులు రావణ రాజ్య నడుస్తోందన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణపై ఆయన స్పందిస్తూ సామాన్య ప్రజలు ఏమంటున్నారో ముఖ్యం కాక ప్రతిపక్షాల మాట కాదని జవాబిచ్చారు. సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసుపై స్పందిస్తూ దర్యాప్తు కొనసాగుతోందని, దానిపై తాను ఇప్పుడు స్పందించబోనని బొమ్మై చెప్పారు.