బెంగళూరు: కొవిడ్-19 లాక్‌డౌన్‌కు సంబంధించిన ప్రస్తుతం అమలులోఉన్న మార్గదర్శకాలు ఈ నెల 21వ తేదీన ముగిసిన తర్వాత లాక్‌డౌన్ ఆంక్షలలో మరిన్ని సడలింపులు ఉంటాయని కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప సూచనప్రాయంగా వెల్లడించారు. మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితిని ఈరోజు, రేపు అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యల గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడుతోందని, ఎటువంటి సడలింపులు ఉండాలో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
తొలుత ఏప్రిల్ 27న 14 రోజుల రాష్ట్రవ్యాప్త క్లోస్-డౌన్ ప్రకటించిన కర్నాటక ప్రభుత్వం తర్వాత కరోనా కేసులు పెరిగిపోవడంతో మే 10 నుంచి మే 24 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. గత వారం తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం 11 జిల్లాలను మినహాయించి మిగిలిన ప్రాంతాలలో కొన్ని ఆంక్షల సడలింపులను ప్రకటించింది. చిక్కమగళూరు, శివమొగ్గ, దావణగెరె, మైసూరు, చామరాజనగర్, హసన్, దక్షిణ కన్నడ, బెంగళూరు రూరల్, మాండ్య, బెలగావి, కొడగు జిల్లాలలో లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలుచేస్తోంది.