బెలగావి (కర్ణాటక): మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం లోని అంతర్గత పోరు నుంచి దృష్టిని మళ్లించడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సరిహద్దు సమస్య లేవనెత్తుతున్నారని కర్ణాటకకు చెందిన ఇద్దరు డిప్యూటీ సిఎంలు ధ్వజమెత్తారు. కర్ణాటకలో మరాఠీ బాగా మాట్లాడే ప్రజలున్న బెలగావి, కర్వార్, నిప్పాణి ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని థాకరే వాదన లేవదీశారు. దీనిపై సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు ఆయా ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని డమాండ్ చేశారు. థాకరే వాదనపై డిప్యూటీ సిఎం గోవింద్ కర్జోల్, మరో డిప్యూటీ సిఎం లక్ష్మణ్ సవాడి అభ్యంతరం లేవదీశారు. శివసేన తమ పార్టీ చారిత్రక పురుషుడుగా ఛత్రపతి శివాజీని చెప్పుకుంటోందని, ఆ శివాజీ కన్నడిగుడని థాకరే తెలుసుకోవాలని గోవింద్ కర్జోల్ గుర్తు చేశారు. అనేక విషయాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని లక్ష్మణ్ సవాడీ విమర్శించారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రి శశికళ జొల్లె బెలగావి జిల్లా చరిత్ర గురించి వివరిస్తూ బ్రిటిష్ వారిపై పోరాటం జరిపిన కుత్తూరు రాణీ చెన్నమ్మ పాలించిన భూమి బెలగావిగా అభివర్ణించారు.