Monday, January 20, 2025

సిబిఐ చీఫ్‌గా కర్నాటక డిజిపి ప్రవీణ్ సూద్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) తదుపరి డైరెక్టర్‌గా కర్నాటక డిజిపి ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ పదవీ విరమణ అనంతరం ప్రవీణ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిలతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ శనివారం సాయంత్రం సమావేశమైంది. కర్నాటక డిజిపి ప్రవీణ్ సూద్, మధ్యప్రదేశ్ డిజిపి సుధీర్ సక్సేనా, తాజ్ హాసన్‌లను ఈ పదవి కోసం ఎంపిక చేసింది. చివరికి ప్రవీణ్ సూద్‌ను సిబిఐ డైరెక్టర్‌గా నియమించింది.

ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ రెండేళ్ల పదవీ కాలం మే 25తో ముగుస్తుంది. ఆయన తర్వాత ప్రవీణ్ సూద్ సిబిఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. సిబిఐ డైరెక్టర్ పదవిలో నియమితులైన వారి పదవీ కాలం రెండేళ్లు. ప్రవీణ్ సూద్ కర్నాటక కేడర్ 1986 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. ప్రస్తుతం కర్నాటక డిజిపిగా పనిచేస్తున్నారు. ఆయనపై కర్నాటక కాంగ్రెస్ నేత డికె. శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని, బిజెపిని కాపాడుతున్నారని, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News