Monday, December 23, 2024

తాగుబోతుల సంఘం న్యాయమైన డిమాండ్లు తీర్చాలి

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి సమకూరుస్తున్న తమ బాగోగులు పిట్టించుకోవాలంటూ మందుబాబులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కర్నాటకలోని హసన్‌లో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మందుబాబులు చేసిన డిమాండ్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యాన్ని నిషేధించండి లేదా మద్యం ప్రియులకు సౌకర్యాలైనా కల్పించండి అంటూ కొత్తగా ఏర్పడిన కర్నాటక మద్యపాన ప్రియర పోరాట సంఘ అధ్యక్షుడు వెంటకేష్ బోరేహళ్లి డిమాండు చేస్తున్నారు. నవంబర్ 8న ఈ సంఘం రిజిస్టర్ అయింది. మద్యపాన ప్రియుల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంఘం డిమాండు చేస్తోంది.

తమ కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, కాలేయానికి సంబంధించిన రోగాలు వస్తే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, చనిపోయిన పక్షంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సంఘం డిమాండు చేస్తోంది. అంతేగాక..మద్యపాన ప్రియుల కోసం బిపిఎల్ కార్డుదారులకు కేటాయించే ఇళ్లలోఏటా ఒక లక్ష ఇళ్లను ప్రత్యేకంగా కేటాయించాలని, తాగుబోతు తండ్రుల కారణంగా మధ్యలోనే చదువుమానేసిన పిల్లలకు ప్రభుత్వ హాస్టళ్లలో రిజర్వేషన్ కల్పించాలని కూడా సంఘం డిమాండు చేసింది. వీటితోపాటు బార్లు, వైన్ షాపులలో తాగితాగి పడిపోయే తమ కోసం ఒక ప్రత్యేక విశ్రాంతి గదిని కూడా సమకూర్చాలని మందుబాబుల సంఘం డిమాండు చేస్తోంది. మద్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దండిగా ఆదాయం వస్తున్నప్పటికీ తమ సంక్షేమాన్ని మాత్రం విస్మరిస్తోందని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అరసికెరెలో తమ సంఘం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కె గోపాలయ్యను ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. ఆయన డేట్ కోసం ఎదురుచూస్తున్నామని, ఆయనతోపాటు మరో నలుగురు ఎమ్మెల్యేలను కూడా ప్రారంభోత్సవానికి ఆహ్వానించామని ఆయన చెప్పారు. మద్యాన్ని సురక్షితంగా తాగడం ఎలా అనే అంశంపైన మాట్లాడేందుకు ఎక్సయిజ్ కమిషనర్‌ను ఆహ్వానించామని వెంకటేష్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మద్యం ద్వారా రాష్ట్రానికి రూ. 19,540 కోట్ల ఆదాయం లభించింది. 2021-22 సంవత్సరంలో రూ. 26,378 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి మద్యం ద్వారా లభించినట్లు ఎక్సయిజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

మద్యం తాగి వనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 1లక్ష నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, ప్రతి లిక్కర్ బాటిల్‌ను బీమా చేయాలని వెంటకేష్ డిమాండు చేశారు. లివర్ లేదా ఇతర సర్జరీలు చేయించుకోవలసి వస్తే రూ. 6 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కూడా ఆయన డిమాండు చేశారు. ఎంఆర్‌పిని మించి లిక్కర్ బాటిల్‌ను అమ్మకుండా నిరోధించేందుకు బార్లు, లిక్కర్ షాపుల వద్ద లిక్కర్ రేట్లను ప్రదర్శించాలని, కస్టమర్లకు మినరల్ వాటర్‌ను సమకూర్చడంతోపాటు పరిశుభ్రమైన టాయిలెట్లను కల్పించాలని తమ సంఘం డిమాండు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తమది రాష్ట్ర స్థాయి సంఘమని, బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఉంటుందని ఆయన అన్నారు. త్వరలోనే సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని, రాష్ట్ర వ్యాప్తగా 2 లక్షల మందికి పైగా సభ్యులు తమ సంఘంలో చేరతారని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News